థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాల సందడి మొదలైంది. ఇప్పటికే ‘పాగల్’, ‘రాజ రాజ చోళ’ చిత్రాలు సీని ప్రేమికుల ముందుకు వచ్చి అలరించాయి. శుక్రవారం (ఆగస్టు 27న) ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఇచ్చట వాహనాలు నిలుపురాదు’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ రెండు చిత్రాలు భిన్నమైనవే. ఈ రెండు చిత్రాలు భిన్నమైన టైటిల్స్‌తో ప్రేక్షకుల మందుకు వస్తున్నాయి. ఒకటి పల్లెటూరు ప్రేమకథతో.. మరొకటి నేటి ట్రెండ్‌కు తగిన థ్రిల్లర్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి.
‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా కథాంశంలోకి వస్తే.. ఓ పల్లెటూరిలో సోడాల శ్రీదేవి(ఆనంది)కి, లైటింగ్ సూరిబాబు(సుధీర్ బాబు)కు మధ్య ప్రేమ చిగురిస్తుంది. తండ్రి (నరేష్) సోడాల షాపు బాధ్యతలు చూసుకొనే శ్రీదేవిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు సూరిబాబు. ఈ విషయం తండ్రికి తెలుస్తుంది. ఇద్దరిదీ ఒకే కులం కాదనే కారణంతో శ్రీదేవికి వేరే అబ్బాయితో పెళ్లి చేసేస్తారు. అయితే, సూరిబాబు ఎవరిని హత్య చేసి జైలుకు వెళ్తాడు? జైలు నుంచి బయటకు వచ్చి ఎలా పగతీర్చుకుంటాడనేది ఈ సినిమాలో చూపిస్తున్నారు. సినిమా నిర్మాణ ప్రమాణాలను ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ముఖ్యంగా కెమేరా పనితనం మంచి విజువల్ ట్రీట్ ఇస్తుంది. ఇందులో శ్రీదేవి పాత్రలో ఆనంది మరింత అందంగా కనిపించింది. ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ సినిమాలతో పోల్చితే నటనలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. చక్కని ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటోంది. తమిళ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఆనంది ‘జాంబి రెడ్డి’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిందనే చెప్పుకోవాలి. ఈ చిత్రం కూడా హిట్ సాధిస్తే.. ఆనందికి అవకాశాలు క్యూకడతాయి.
ఈ చిత్రం సుధీర్ బాబు కూడా చాలా ముఖ్యమైనది. సుధీర్ బాబు రొటిన్ కథలకు బదులు.. కాస్త భిన్నంగా ఉండే సినిమాలు చేయడానికే ఇష్టపడతాడు. అయితే, ‘నన్ను దోచుకుందువటే’ సినిమా మినహా మరే చిత్రం సరైన హిట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా మీద సుధీర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. సూరిబాబు పాత్రలో ఒదిగిపోయాడు. పల్లెటూరి కుర్రాడిలా.. తన బాడీ లాంగ్వేజ్‌ను కూడా బాగానే మలుచుకున్నాడు. మరి సురిబాబుగా ప్రేక్షకులను మెప్పించగలడో లేదో చూడాలి. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించగా, విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మాతలు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.
‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్:
‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ సినిమా విషయానికి వస్తే.. ‘చి.ల.సౌ’ సినిమా హిట్ తర్వాత ‘అలా వైకుంఠపురంలో’ సినిమాతో ప్రేక్షకులను అలరించి సుశాంత్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే.. ఈచిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకొనేలా ఉంది. అయితే, ఇది కూడా ప్రేమకథా చిత్రమే. అయితే, ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు ఏ విధంగా కష్టాల్లో చిక్కుకుంటాడనేది ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు అర్థమవుతుంది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం వస్తోంది. ఎస్.దర్శన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సుశాంత్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి- ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా మార్చిలోనే విడుదల కావాలి. కానీ, కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో థియేటర్స్ అందుబాటులో లేక విడుదలను వాయిదా వేశారు. మొత్తానికి ఇది ఆగస్టు 27న విడుదలయ్యేందుకు సిద్ధమైపోయింది. అప్పటివరకు గర్ల్‌ఫ్రెండ్‌తో హ్యాపీగా గడిపేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో సుశాంత్ ఊహించని చిక్కుల్లో పడతాడు. తన కొత్త బైకుతో ఓ కాలనీలోని ప్రియురాలు(మీనాక్షి) ఇంటికి వెళ్లి అడ్డంగా బుక్కైపోతాడు. ఆమె అన్న (వెంకట్) రౌడీలు ఒక పక్క, పోలీసులు మరో పక్క సుశాంత్‌ను పట్టుకోడానికి ప్రయత్నిస్తారు. అతడి కొత్త బండిని తుక్కు తుక్కు చేస్తారు. చివరికి సుశాంత్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లడాన్ని ఈ ట్రైలర్‌లో చూడవచ్చు. ఈ చిత్రంలో ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతుమురారండి’ సినిమా హీరో వెంకట్ హీరోయిన్ అన్నగా ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమతం ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ ట్రైలర్: