Scorpion Bites Passenger:



నాగ్‌పూర్ ముంబయి ఫ్లైట్‌లో 


ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లో మరో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. నాగ్‌పూర్ నుంచి ముంబయికి వెళ్తున్న ఫ్లైట్‌లో ఓ మహిళను తేలు కరిచింది. గత నెల జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ల్యాండ్ అయిన వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం వల్ల ప్రాణాపాయం తప్పిందని అధికారులు వెల్లడించారు. డిశ్ఛార్జ్‌ కూడా చేశారని తెలిపారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ సంఘటన జరిగిందని ఎయిర్ ఇండియా వివరించింది. ఇలా జరగటం చాలా దురదృష్టకరమని తెలిపింది. ఇది జరిగిన వెంటనే ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఫ్లైట్ మొత్తం తనిఖీలు చేసింది. ప్రోటోకాల్ ఆధారంగా ఇన్‌స్పెక్ట్ చేసి తేలుని గుర్తించి బయటకు తీసింది. తేలుతో పాటు నల్లులు కూడా ఉన్నట్టు అనుమానించిన అధికారులు క్యాటరింగ్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడారు. డ్రై క్లీనర్స్‌తో అన్ని సీట్‌లనూ చెక్‌ చేశారు. ఇప్పుడే కాదు. గతంలోనూ ఫ్లైట్‌లలో ఇలా తేళ్లు, పాములు కనిపించడం కలకలం రేపింది. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తమైంది. 


కార్గోలో పాము..


గతంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) కార్గోలో పాము కనిపించడం కలకలం రేపింది. కాలికట్ నుంచి దుబాయ్‌కు వెళ్లిన ఫ్లైట్‌లోని కార్గోలో సిబ్బందికి పాము కనిపించింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాక...కార్గోలో పాము కనిపించడం వల్ల సిబ్బంది కాస్త కంగారు పడ్డారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపిన తరవాత అగ్నిమాపక సిబ్బందికి ఈ విషయం తెలియజేశారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. హ్యాండ్‌లింగ్ స్టాఫ్‌ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగి ఉంటుందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు. అటు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధులు మాత్రం ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. విమానంలో ఇలాంటివి జరగటం ఇదే తొలిసారి కాదు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి న్యూజెర్సీకి వచ్చిన యునైటెడ్ ఫ్లైట్‌లోనూ పాము వెలుగులోకి వచ్చింది. విమాన సిబ్బంది వచ్చి ఆ పాముని పట్టుకోవడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి హానీ కలగలేదు. 


సౌతాఫ్రికాలోనూ..


సౌతాఫ్రికాలోనూ ఇలాంటి సంచలన సంఘటన జరిగింది. ఫ్లైట్‌ గాల్లో ఉండగా...కాక్‌పిట్‌లో కోబ్రా కనిపించింది. ఇది చూసిన పైలట్ ఒక్కసారిగా భయపడిపోయాడు. ఆ తరవాత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేశాడు. ఆ పైలట్ చేసిన పనిని ఎక్స్‌పర్ట్స్ అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు ఐదేళ్లుగా పైలట్‌గా పని చేస్తున్నాడు రడోల్ఫ్ ఎరాస్మస్‌. ఈ క్రమంలోనే నలుగురు ప్రయాణికులతో కూడిన ఓ చిన్న ఎయిర్ క్రాఫ్ట్‌ను నడిపాడు. టేకాఫ్ అయిన కాసేపటికే తన సీట్ కింద కోబ్రాను చూశాడు. ఉన్నట్టుండి అది వెంటనే దాక్కుంది. ముందు భయపడినా  ఆ తరవాత కాస్త తేరుకుని వెంటనే ల్యాండ్ చేశాడు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నాడు. 


Also Read: Karnataka Elections 2023: టిప్పు సుల్తాన్‌ జయంతి జరపాలంటే పాకిస్థాన్‌కు వెళ్లిపోండి, కాంగ్రెస్‌పై అసోం సీఎం ఆగ్రహం