SCO Summit 2023:
గోవాలో ఎస్‌సీఓ సమ్మిట్
గోవాలో జరుగుతున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO Summit) సదస్సుకి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto) హాజరయ్యారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆయనకు స్వాగతం పలికారు. నమస్తే అంటూ బిలావల్‌కు వెల్‌కమ్ చెప్పారు. ఆ తరవాత సదస్సు వేదికవైపు తీసుకెళ్లారు. ఐక్యరాజ్య సమితిలో ఈ ఇద్దరి మధ్య వాడివేడి చర్చ జరిగింది. పదేపదే బిలావల్ కశ్మీర్ సమస్యను తెరపైకి తీసుకురావడం....దానికి జైశంకర్ గట్టి కౌంటర్ ఇవ్వడంపై అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. రెండు దేశాల మధ్య వైరం పెరుగుతోందనుకుంటున్న తరుణంలో బిలావల్ భుట్టో ఇండియాకు రావడం కీలకంగా మారింది. దాదాపు 12 ఏళ్లుగా పాక్‌కు చెందిన ఓ సీనియర్ లీడర్ భారత్‌లో పర్యటించింది లేదు. ఇన్నేళ్ల తరవాత భుట్టో వచ్చారు. అయితే...వీరిద్దరి మధ్య ఏం చర్చ జరుగుతుందన్నది మాత్రం ఇంకా అధికారికంగా తెలియలేదు. ఇప్పటికే ఉగ్రవాదం విషయంలో పాక్‌పై తీవ్రంగా మండి పడుతోంది భారత్. క్రాస్ బార్డర్ టెర్రరిజం సమస్యనూ పదేపదే ప్రస్తావిస్తోంది. అటు పాక్ మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేస్తోంది. ఇక కశ్మీర్ విషయంలో అయితే తరచూ వాగ్వాదం జరుగుతూనే ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆపేయాల్సిందేనని భారత్ ఈ సదస్సు వేదికగా పాక్‌కు మరోసారి గట్టిగా చెప్పింది.
చైనా విదేశాంగ మంత్రితోనూ సమావేశం..
ఇదే సదస్సులో చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌తోనూ భేటీ అయ్యారు జైశంకర్. ఈ సందర్భంగా కీలక అంశాలు చర్చించారు. చైనాతోనూ సరిహద్దు వివాదాలు ఉండటం వల్ల అదే అంశంపై మాట్లాడారు. చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వద్ద పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని స్పష్టం చేశారు.
"భారత్ చైనా సరిహద్దు వద్ద ప్రస్తుత పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. అయినప్పటికీ రెండు దేశాలూ తమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. గతంలో చేసుకున్న ఒప్పందాలకు గౌరవమివ్వాలి. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ఇరు దేశాలూ పరస్పరం సహకరించుకోవాలి"
- కిన్ గాంగ్, చైనా విదేశాంగ మంత్రి
జైశంకర్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చైనా విదేశాంగ మంత్రితో అన్ని విషయాలూ చర్చించినట్టు వెల్లడించారు. SCOలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇరాన్, బెలారస్‌ను కూడా SCOలో చేర్చాలని ప్రతిపాదించింది.
"చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌తో పూర్తి స్థాయిలో చర్చలు జరిపాను. ద్వైపాక్షిక సంబంధాలపైనా చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు ఆయన కూడా సమ్మతం తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు"
- జైశంకర్, భారత విదేశాంగ మంత్రి