అంగారకుడిపై కాలనీలు సాధ్యమేనా? అంటే కొన్నేళ్ల క్రితం వరకు అయితే అంతా పెదవి విరిచేవారు. కానీ ఇటీవల జరుగుతున్న వరుస పరిశోధనలతో ఇది సాధ్యమనే భావనకు వస్తున్నారు. అంగారకుడు, చంద్రుడు వంటి ఇతర గ్రహాలపై నిర్మాణాలు చేపట్టడంలో మరో ముందడుగు పడింది. మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం ఒక కొత్త పరిశోధనను ప్రపంచానికి పరిచయం చేసింది. వ్యోమగాముల రక్తం, చెమట, కన్నీళ్లతో పాటు గ్రహాంతర ధూళితో కాంక్రీట్ లాంటి పదార్థాన్ని సృష్టించే మార్గాన్ని అభివృద్ధి చేసింది.


ఈ అధ్యయనంలో మనుషుల రక్తంలోని ప్రోటిన్ (మానవ సీరం అల్బుమిన్).. యూరియా (మూత్రం, చెమట లేదా కన్నీటి నుండి వచ్చే సమ్మేళనం) తో కలవడం ద్వారా కాంక్రీట్ లాంటి గట్టి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని గుర్తించారు. దీనిని చంద్రుడు లేదా అంగారక మట్టిని కలిపితే  సాధారణంగా మనం ఉపయోగించే కాంక్రీటు కంటే కూడా చాలా బలమైన పదార్థంగా మారుతుందని తెలిపారు. మార్టిన్ కాలనీల (Martian colonies) ఏర్పాటులో కీలకమైన సమస్యను పరిష్కరించడానికి ఇది సాయం చేస్తుందని వారు చెబుతున్నారు. భూమి కాకుండా ఇతర గ్రహాల వాతావరణంలో నిర్మాణ పనులకు ఇది కచ్చితంగా సరిపోతుందని ఉద్ఘాటించారు. 


వ్యోమగాముల రక్తం, చెమట, కన్నీళ్లు, ఇతర గ్రహాల మట్టితో ఏర్పడిన పదార్థాన్ని ఆస్ట్రోక్రీట్ అని పిలుస్తామని పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆరుగురు వ్యోమగాముల ద్వారా అంగారక గ్రహం ఉపరితలంపై రెండేళ్ల సమయంలో 500 కేజీల ఆస్ట్రోక్రీట్‌ను ఉత్పత్తి చేయవచ్చని లెక్కించారు. అంగారక గ్రహంపై కాలనీలు నిర్మించాలంటే అక్కడికి సామగ్రి పంపాలని.. ఇది అత్యంత ఖరీదైన సవాల్ అని, దీనిని పరిష్కరించడానికి తాము ఈ అద్భుతమైన మార్గాన్ని కనుగొన్నట్లు తెలిపారు. 


మార్స్ ఉపరితలంపై కాంక్రీట్ లాంటి పదార్థాల ఉత్పత్తికి ఏయే మార్గాలు ఉన్నాయనే విషయాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారని.. మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన అలెడ్ రాబర్ట్స్  ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం ఆచరణీయమైన సాంకేతికతలను శాస్త్రవేత్తలు అనుసరిస్తున్నారని, ఇది మన ద్వారానే సాధ్యమవుతుందని ఎప్పుడూ అంచనా వేయలేదని చెప్పారు. దీని ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేస్తామని తెలిపారు.  


అంగారక గ్రహంపై నీరు తక్కువగా ఉంటుంది. ఒక ఇటుకను అంగారక గ్రహానికి పంపాలంటే దాదాపు 2 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. ఇలా కాకుండా వ్యోమగాముల రక్తం, చెమట, కన్నీళ్లతో తయారైన కాంక్రీటును అక్కడే తయారు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అధ్యయన వివరాలు మెటీరియల్స్ టుడే బయో జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 


Also Read: Pet to Travel in Style: పెంపుడు కుక్క కోసం బిజినెస్ క్లాస్ మొత్తాన్ని బుక్ చేశాడు... రూ.2.5 లక్షలు ఖర్చు చేశాడు


Also Read: Whistiling village Kongthong: అక్కడ ఎవరినైనా విజిలేసి పిలుస్తారు... పేర్లు కూడా ఈల శబ్ధాలే...