నేటి ప్రత్యేకత:
అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం.
జాతీయ కజిన్స్ డే.
ఆంధ్రప్రదేశ్ వార్తలు:
- ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమయం లేనప్పుడు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు.
- జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఆమోదించింది. దీంతోపాటు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లును ఆమోదించింది. మత్స్యకారులను ఇబ్బంది పెడుతున్న 217 జీవో రద్దు చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.
తెలంగాణ వార్తలు:
- నేడు తెలంగాణ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. శాసనసభ సమావేశాలు అగస్ట్ రెండో తేదీ వరకు జరగనున్నాయి.
- కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజధాని ఢిల్లీలో దీక్షకు సిద్ధమని ప్రకటించారు. కేసీఆర్ కూడా దీక్షకు రావాలని డిమాండ్ చేశారు.
జాతీయ వార్తలు:
- వైద్య విద్య కోర్సుల్లో యూజీ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షను వ్యతిరేకించే రాష్ట్రాల జాబితాలో పశ్చిమబెంగాల్ కూడా చేరింది.నీట్ పరీక్షను రద్దు చేసి అంతకుముందు ఉన్న పద్దతిని అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ బెంగాల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.
- బీహార్ శాసనసభ కీలక బిల్లును ఆమోదించింది. ఇక బీహార్‌లో ఎవరైనా పరీక్షా పేపర్ లీక్ చేసినా.. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినా మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. పది లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తారు.
అంతర్జాతీయ వార్తలు
- చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్న చైనా కీలక ప్రకటన చేసింది. నాలుగేళ్లుగా జాబిల్లిపై విస్తృత పరిశోధనలు చేస్తున్న చైనా చంద్రుడిపై నీటి జాడను తమ శాస్త్రవేత్తలు గుర్తించినట్లు వెల్లడించింది. చంద్రుడిపై నుంచి 2 కిలోల మట్టి, రాళ్ల నమూనాలను భూమికి తెచ్చిన చైనా ఆ నమూనాల్లో నీటి అణువులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది.
- నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలి 18 మంది మరణించారు. ఖాట్మాండులోని త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
క్రీడా వార్తలు
- అధికారికంగా ఒలింపిక్స్ రేపు ప్రారంభం కానున్నాయి. అయితే అనధికారికంగా ఒక రోజు ముందే ఇవాళ్టీ నుంచి భారత్ పతకాల వేట ప్రారంభం కానుంది. ఆర్చరీ జట్టు ఇవాళ తొలి రౌండ్ మ్యాచ్ ఆడనుంది.
ఇవాళ్టి మంచిమాట
- శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.