22nd July 2024 News Headlines in Telugu For School Assembly: 

1. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభను వాయిదా వేసి బీఏసీ సమావేశం నిర్వహించి ఎజెండాపై చర్చిస్తారు. కూటమి ప్రభుత్వం సభలో మూడు శ్వేతపత్రాలను విడుదల చేయనుంది.  ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేసే బిల్లును రేపు సభలో ప్రవేశపెట్టనున్నారు.

 

2. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో భారీగా పంటనష్టం సంభవించింది. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునగడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. వరద ఉద్ధృతికి వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజికి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

 

3. ఐఏఎస్‌ అధికారిణి స్మిత సబర్వాల్‌ చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఐఏఎస్‌ సర్వీసుల్లోకి దివ్యాంగులు ఎందుకంటూ ఆమె చేసిన పోస్ట్‌ పెద్ద దుమారమే రేపింది. దీనిపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై దివ్యాంగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

4. ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టలకు జలకళ వచ్చింది. దుమ్ము గూడెం వద్ద తొమ్మిది లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి వరద పెరుగుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

 

5. కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ పూరిస్థాయి బడ్జెట్‌ను సభ ముందు ఉంచుతారు. డిప్యూటీ స్పీకర్‌ పదవి కోసం పట్టుబడుతున్న ప్రతిపక్షాలు ఇవాళ సభలోనూ ఆ అంశంపై పట్టుబట్టే అవకాశం ఉంది. ఆగస్టు 12 వరకు పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతాయి.

 

6. ఇటీవల తీసుకొచ్చిన ఆరో తరగతి సోషల్‌, విజ్ఞాన శాస్త్ర పుస్తకంలో ఎన్‌సీఈఆర్‌టీ  పలు మార్పులు చేసింది. గ్రీనిచ్‌ రేఖ, కులవివక్ష ప్రస్తావన, అంబేడ్కర్‌ అనుభవించిన వివక్ష అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఎక్స్‌ప్లోరింగ్‌ సొసైటీ ఇండియా అండ్‌ బియాండ్‌ పేరుతో ఉన్న ఈ పుస్తకంలో కుల వ్యవస్థ గురించి కాకుండా వేదాల అంశాలను ప్రస్తావించారు. 

 

7. ఊహాగానాలను నిజం చేస్తూ అమెరికా అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ తప్పుకున్నారు. బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని ఇప్పటికే సొంత పార్టీ నేతలు చాలామంది డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్‌ వెల్లడించారు. అగ్రరాజ్య ప్రజలకు ఓ లేఖ కూడా రాశారు. ఇక బైడెన్‌ స్థానంలో అధ్యక్ష స్థానానికి ఎవరు పోటీ పడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

 

8. ఆసియా కప్‌లో భారత మహిళల జట్టు దూకుడు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన మహిళల జట్టు... రెండో మ్యాచ్‌లో యూఏఈని చిత్తు చేశారు. టీ 20 మ్యాచ్‌లో భారత్‌ తొలిసారిగా 200కుపైగా పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 201 పరుగులు చేయగా... యూఏఈ 123 పరుగులే చేసింది. 

 

9. భారత్‌లో వృద్ధుల జనాభా పెరుగుతోంది. 2050 నాటికి దేశంలో వృద్ధుల జనాభా రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2050 నాటికి దేశంలో 60 సంవత్సరాల వయసు దాటిన వారి సంఖ్య 34 కోట్లకు చేరుతుందని తెలిపింది. అలాగే దేశంలో పల్లెటూర్లు కూడా తగ్గుతాయని 2050 నాటికి 50 శాతం సిటీలే ఉంటాయని వెల్లడించింది. 

 

10. ఆత్మవిశ్వాసం మనిషికి పెట్టని ఆభరణం- స్వామి వివేకానంద