8th August 2024 School News Headlines Today: 

 


నేటి ప్రత్యేకత:

ఇవాళ క్విట్‌ ఇండియా దినోత్సవం (1942 ఆగష్టు 8 తేదీన, క్విట్ ఇండియా తీర్మానాన్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదించింది)

 

ఆంధ్రప్రదేశ్‌ వార్తలు

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే అనర్హులు అనే నిబంధన అడ్డంకిగా ఉండేది. దీన్ని రద్దు చేసే అంశంపై ఏపీ క్యాబినెట్ లో చర్చించింది. జనాభా పెరుగుదల ఆవశ్యకత గుర్తించి ఈ రూల్‌ రద్దు చేయాలని నిర్ణయించారు. 

 

ఆంధ్రప్రదేశ్‌లో మైనార్టీ విద్యార్థుల డ్రాపవుట్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మైనార్టీ విద్యార్థుల డ్రాపవుట్‌ జాతీయ సగటు కంటే..ఏపీలోనే ఎక్కువగా ఉన్నట్లు పార్లమెంట్‌లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజూ తెలిపారు. జాతీయ స్థాయిలో డ్రాపవుట్‌ 10.5 ఉండగా, ఏపీలో అది 15.2గా ఉందని రిజిజూ వివరించారు. 

 

తెలంగాణ వార్తలు:

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇంజెక్టబుల్స్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వివింట్‌ ఫార్మా కంపెనీ ప్రకటించింది. దీంతో దాదాపు వెయ్యిమందికి ఉపాధి లభించనుంది.

 

జీవో 33 వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు అదనంగా సీట్లు లభించేందుకే  జీవో 33ను జారీ చేసినట్లు తెలిపారు.  అయితే దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 

 

జాతీయ వార్తలు: 

విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా, సహేతుక అంశాలకు గొంతుకగా నిలవాలని .సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సూచించారు. విద్యార్థులు ప్రపంచంలోని అన్యాయాలను గుర్తించాలన్నారు.  భారత రాజ్యాంగం... అసమానతలపై పోరాడే శక్తిమంతమైన ఆయుధమని.. పౌరులకు రాజ్యాంగం బాధ్యతలను నిర్దేశిస్తుందని అన్నారు. మన సమాజానికి అస్తవ్యస్త గళాలతోనే ముప్పు ఉందన్నారు. 

 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక సూచన చేసింది. విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు రిజర్వు చేయాలని సూచించింది. పంజాబ్, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ రాష్టాలు ఆ నిబంధన అణలు చేయట్లేదని తేల్చి చెప్పింది.

 

అంతర్జాతీయ వార్తలు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆదేశ ఆర్మీ ఛీప్ వకర్-ఉజ్-జామా వెల్లడించారు. బంగ్లాదేశ్‌ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. 

 

క్రీడా వార్తలు

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమైంది. నాకు ఇంకా పోరాడే బలం లేదు’ అంటూ Xలో పేర్కొన్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరిన వినేశ్‌.. అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. 

 

పోరుకు ముందు 100 గ్రాముల అదనపు బరువుతో అనర్హతకు గురైన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్)ను ఆశ్రయించింది. సెమీస్‌ గెలిచి ఫైనల్‌కు వెళ్లిన తనకు సిల్వర్‌ మెడల్‌ ఇవ్వాలని ఫిర్యాదులో కోరింది. సీఏఎస్‌ ఆగస్టు 8న తీర్పు ఇవ్వనుంది. సీఏఎస్‌ రూల్స్‌ వినేశ్‌కు అనుకూలంగా వస్తే భారత్‌కు మరో పతకం వచ్చినట్లే. 

 

మంచి మాట

జీవితంలో ప్రతీ సమస్య మన సామర్థ్యాన్ని పెంచుతుంది.