6th August 2024 School News Headlines Today:
నేటి ప్రత్యేకత:
తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి.
పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతి.
ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు గద్దర్ వర్ధంతి.
అంతర్జాతీయ వార్తలు
పొరుగు దేశం బంగ్లాదేశ్.. సైనిక పాలనలోకి వెళ్లింది. దేశవ్యాప్తంగా హింస చెలరేగడంతో బంగ్లా ప్రధాని షేక్ హసినా పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో హసినా దేశం విడిచి భారత్‌కు వచ్చారు. బంగ్లాదేశ్ సైన్యం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అధికారిక నివాసం గణ భవన్‌పై వందలాదిమంది ఆందోళనకారులు దాడి చేశారు. అందులోని టీవీలు, సోఫాలు సహా అన్ని వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. బంగబంధు భవన్‌కు నిప్పు పెట్టారు. బంగ్లా ప్రధాని తండ్రి ముజీబుర్ రెహ్మన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
జాతీయ వార్తలు
బంగ్లాదేశ్‌లో ఆందోళనలతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు వెంట సైనికులను హై అలెర్ట్‌లో ఉండాలని ఆదేశించింది. భారత కమాండర్లు బోర్డర్లు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లే రైళ్లు, విమానాలు రద్దు చేశారు. ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిశారు. బంగ్లాదేశ్‌పై భారత ప్రభుత్వ వైఖరిని ఆమెకు స్పష్టంగా వివరించారు. వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నెలా ఒకటో తేదీన పేదల సేవలో పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు పేదల స్థితి గతులను తెలుసుకోవాలని ఆదేశించారు. ఏం చేస్తే ప్రజలు పేదరికం నుంచి బయటపడతారో ఆలోచించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వినియోగాన్ని ఆరంభించింది. ప్రభుత్వ పనితీరుపై పేపర్లు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై విశ్లేషణకు కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణను ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులోకి తెచ్చారు.
తెలంగాణ వార్తలు:
తెలంగాణలో భారీ విస్తరణకు ప్రముఖ కాగ్నిజెంట్ కంపెనీ ముందుకొచ్చింది. 15 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించేలా భారీ విస్తరణ చేస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమైన ఆ కంపెనీ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో శుభ్రతపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతీ పాఠశాలకు ప్రభుత్వం నిధులు కేటాయించనుంది. నెలకు మూడు వేల నుంచి 20 వేల వరకు ప్రభుత్వం ఇవ్వనుంది.
క్రీడలు
ఒలింపిక్స్‌లో నేడు భారత హాకీ జట్టు కీలక మ్యాచ్ ఆడనుంది. సెమీఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ జర్మనీతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. 1980 తర్వాత భారత్ ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరలేదు. ఇవాళ్టీ మ్యాచ్‌లో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించాలని భారత్ భావిస్తోంది.
టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా... ఈ ఒలింపిక్స్‌లో ఇవాళ బరిలోకి దిగనున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో నీరజ్ చోప్రా పాల్గొంటాడు. ఇవాళ నీరజ్ పైనల్‌కు అర్హత సాధిస్తే గురువారం ఫైనల్ జరగనుంది.
మంచిమాట
విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు, స్నేహాలకు దూరంగా ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలరు.