3rd August 2024 School News Headlines Today:
నేటి ప్రత్యేకత:
1994 ఆగస్టు 3న భారత్‌లో తొలి గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు.
ఇవాళ ప్రముఖ కవి మైథిలీ శరణ్ గుప్త జననం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాల పటిష్టతపై ఇప్పుడే ఏం చెప్పలేమని ఐఐటీ నిపుణుల బృందం స్పష్టం చేసింది. ఈ భవనాలను పరిశీలించిన బృందం.. క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే తప్ప ఏం చెప్పలేమని వెల్లడించింది. దీనిపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీ వ్యాప్తంగా 33, 480 ప్రైమరీ స్కూల్స్ ఉండగా.. అందులో పిల్లలు లేక గతేడాది 118 స్కూల్స్‌ను మూసేశారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని నివేదికలు చెప్తున్నాయి.
తెలంగాణ వార్తలు
తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ఆ సంఖ్య ప్రకటిస్తామని వెల్లడించారు.
తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్తగా ప్రమోషన్లు వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో సీఎం పాల్గొన్నారు. 26లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే ఉందని గుర్తు చేశారు.
జాతీయ వార్తలు
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. శుభాంశుకు బ్యాకప్ కింద గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను కూడా ఎంపిక చేసింది. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర లిఖించనున్నారు .
ఢిల్లీలో ప్రభుత్వ ఆశ్రమంలో చిన్నారులు అనుమానాస్పందంగా మరణిస్తుండడం కలకలం రేపుతోంది. 20 రోజుల వ్యవధిలో 14 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఎక్కువ మంది మానసిక వికలాంగులే. ఈ ఏడాది ఇప్పటివరకు 27 మంది చనిపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
అంతర్జాతీయ వార్తలు
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ అధికారికంగా ఖరారయ్యారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌తో ఆమె అమీతుమీ తేల్చుకోనున్నారు. అభ్యర్థిగా ఎన్నికైనందకు కమలా హారిస్ హర్షం వ్యక్తం చేశారు.
వెనెజువెలాలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అధ్యక్షుడిగా నికోలస్ మడురో ఎన్నికను వ్యతిరేకిస్తూ ఆరంభమైన ఆందోళనలు ఇప్పుడు తీవ్రరూపు దాల్చాయి. విపక్ష నేత మచడో కార్యాలయంపై దాడి జరగడం సంచలనం సృష్టించింది.
క్రీడా వార్తలు
ఒలింపిక్స్‌లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. విశ్వ క్రీడల్లో సెమీఫైనల్ చేరిన తొలి పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. చైనీస్ తైపీ ఆటగాడిపై క్వార్టర్స్‌లో గెలిచి లక్ష్యసేన్ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు.
భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే టై ఆయింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 230 పరుగులు చేయగా... భారత్ కూడా సరిగ్గా 230 పరుగులే చేసింది. వన్డే చరిత్రలో ఇది 44వ టై మ్యాచ్ కావడం విశేషం.
మంచి మాట
దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా మరణించాల్సిందే.