The Kerala Story: 


సుప్రీంకోర్టు విచారణ..


కేరళ స్టోరీ (The Kerala Story) సినిమాను బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బ్యాన్ చేయాల్సిన అవసరమేముందని ప్ర శ్నించింది. ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చింది. బెంగాల్‌లో సినిమాను బ్యాన్ చేయడాన్ని సవాలు చేస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం...ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా సినిమా ఆడుతున్నప్పుడు బెంగాల్‌లో మాత్రం ఎందుకు నిషేధించారని ప్రశ్నించింది. తమిళనాడు ప్రభుత్వం నిషేధించకపోయినప్పటికీ...కొన్ని థియేటర్ల ఓనర్లు కావాలనే సినిమాలు ప్రదర్శించకుండా నిలిపివేశారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపైనా విచారణ జరిపిన సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికీ నోటీసులు అందించింది. ఈ విచారణలో నిర్మాతలూ తమ వాదనలు వినిపించారు. 


"మే 5న దేశవ్యాప్తంగా మా సినిమా విడుదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికేట్ వచ్చిన తరవాతే విడుదల చేశాం. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సినిమాను నిషేధించింది. తమిళనాడులోనూ ఆంక్షలు విధించారు"


- కేరళ స్టోరీ సినిమా ప్రొడ్యూసర్ 






ఈ వాదనపై స్పందించిన సీజేఐ చంద్రచూడ్ ప్రభుత్వానికి నోటీసులిస్తామని స్పష్టం చేశారు. అటు తమిళనాడు ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్రంలో ఎలాంటి నిషేధం విధించలేదని వివరణ ఇచ్చింది. అలాంటప్పుడు థియేటర్ ఓనర్‌లకు సెక్యూరిటీ ఇస్తామని భరోసా ఇవ్వండి అంటూ సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. రాష్టంలో ద్వేషం, హింసాత్మక సంఘటనలు నివారించడానికి, శాంతిని కొనసాగించడానికి ‘ది కేరళ స్టోరీ’ మూవీని నిషేదిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ తరహాలోనే ‘ది కేరళ స్టోరీ’ కూడా ఒక వర్గాన్ని కించపరిచే చిత్రమేనని, ఇది విక్రీకరించిన కథ అని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ నిర్ణయంపై చిత్ర నిర్మాత విపుల్ షా స్పందిస్తూ.. ‘‘మమతా మా మూవీపై నిషేదం విధించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చట్టంలోని నిబంధనల ప్రకారం ఏది సాధ్యమైతే అది చేస్తాం. ప్రభుత్వ నిర్ణయంపై పోరాడుతాం’’ అని వెల్లడించారు. ‘ది కేరళ స్టోరీ’లో సున్నితమైన అంశాలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే కారణంతో తమిళనాడులో కూడా ఈ మూవీపై నిషేదం విధించారు. అయితే, ఈ నిర్ణయాన్ని నేరుగా థియేటర్ అసోషియేషన్లే తీసుకోవడం గమనార్హం.


Also Read: Tax on Netflix: ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌పై ట్యాక్స్! త్వరలోనే ఐటీ శాఖ నిర్ణయం?