విజయ్ దేవరకొండ హీరోగా,  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ సినిమా ‘లైగర్’. గత ఏడాది ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి, రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ కాంబోలో ఈ సినిమా రావడంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరు కలిసి రూపొందించిన తొలి సినిమా సైతం ఇదే కావడంతో మంచి విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇటు ప్రొడ్యూసర్స్‌ కు, అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలు తీసుకు వచ్చింది.


పూరిని వెంటాడుతున్న ‘లైగర్’ కష్టాలు


‘లైగర్’ కోసం చేసిన అప్పులు, అగ్రిమెంట్లు పూరి జగన్నాథ్ ను ఇప్పటికీ వెంటాడుతున్నాయి.  తమ నష్టాలు పూడ్చుకోవడనికి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు  పూరిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పూరికి సంబంధించిన ఓ ఆడియో విడుదలై సంచలనం కలిగించింది. తాను డబ్బులు  ఇవ్వవలసిన అవసరం లేకపోయినా, బయ్యర్లు నష్టపోయారని ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు అందులో పూరి చెప్పారు. కొద్ది రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పినా, కొంత మంది ధర్నాలు చేస్తామని బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఈ సమస్య వినిపించలేదు. అంతటితో ఇష్యూ అయిపోయింది అనుకున్నారు.  


‘లైగర్’ నైజాం ఏరియా ఎగ్జిబిటర్ల  ఆందోళన  


తాజాగా ‘లైగర్’ మూవీ నైజాం ఏరియా ఎగ్జిబిటర్ల  ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎదుట  రిలే దీక్షకు దిగారు. ‘లైగర్‌’ సినిమాతో భారీగా నష్టపోయామని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు.  న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని తేల్చిచెప్పారు. ‘లైగర్’ ద్వారా నష్టపోయిన వాళ్లకు డబ్బులు ఇస్తానన్న పూరీ, ఇప్పటికైనా హామీని నెరవేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనపై పూరీ సైడ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.   


ప్రేక్షకులనే దగా చేశా! – పూరి


‘లైగర్’ సినిమా డిజాస్టర్ తర్వాత పూరి ఓ విరవణ ఇచ్చారు. ''ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే... మనలను పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడు అయినా మోసం చేస్తే? దగా చేస్తే? అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులను మాత్రమే! ప్రేక్షకులను తప్ప నేను ఎవరిని మోసం చేయలేదు'' అని మీడియాకు రాసిన లేఖలో పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. తన ప్రేక్షకులకు మాత్రమే తాను జవాబుదారీ అని ఆయన వివరించారు. మళ్ళీ ఇంకో సినిమా తీసి వాళ్ళను ఎంటర్‌టైన్ చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 


లైగర్​ మూవీని ప్రముఖ బాలీవుడ్ ​సినీ నిర్మాణ సంస్థ ధర్మ  ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్​డ్​ మార్షల్ ​ఆర్ట్స్​నేపథ్యంలో రూపొందింది. భారీ అంచనాల మధ్య పాన్ ​ఇండియా మూవీగా  విడుదలైంది. రిలీజైన తొలి రోజు నుంచే పెద్ద ఎత్తున నెగెటివ్ టాక్ వచ్చింది. పూరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.   


Read Also: తమన్నాతో డేటింగ్ పై స్పందించిన విజయ్ వర్మ, ఇంతకీ ఆయన సమాధానం ఏంటంటే?