SC on Cracker Ban:
సుప్రీం కోర్టులో పిటిషన్
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళికి ఎవరు బాణసంచా కాల్చినా..రూ.200 జరిమానాతో పాటు ఆర్నెల్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. అయితే...ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను కొట్టి వేసిన సర్వోన్నత న్యాయస్థానం..."ప్రజలందరినీ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి" అని వ్యాఖ్యానించింది. పండుగ జరుపుకోటానికి ఇంకెన్నో మార్గాలున్నాయి. ఆ డబ్బేదో స్వీట్‌లు కొనుగోలు చేయటానికి ఖర్చు పెట్టండి అని చెప్పింది సుప్రీం కోర్టు. సీనియర్ భాజపా నేత, ఎంపీ మనోజ్ తివారి ఈ పిటిషన్ వేయగా...ఆయన తరపున న్యాయవాది దీనిపై చర్చను పొడిగించాలని చూసినా.. సుప్రీం కోర్టు "తరవాత విచారిస్తాం" అని తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు మాత్రమే కాదు. అటు ఢిల్లీ హైకోర్టులోనూ ఈ తరహా పిటిషన్‌లు వచ్చాయి. అయితే...సుప్రీం కోర్టు వ్యాఖ్యల తరవాత ఢిల్లీ హైకోర్ట్ కూడా ఆ తరహా పిటిషన్‌లను పక్కన పెట్టేసింది. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (DPCC) బాణసంచాపై నిషేధం విధించటాన్ని సమర్థించింది. దీనికి వ్యతిరేకంగా ఎలాంటి పిటిషన్‌లు వచ్చినా స్వీకరించకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయంలో సుప్రీం కోర్టు ఇప్పటికే జోక్యం చేసుకుని ఓ నిర్ణయం తీసుకుందని...అలాంటప్పుడు స్వతంత్రంగా
ఆ పిటిషన్‌లు స్వీకరించి విచారించటానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
ఆర్నెల్ల జైలు శిక్ష..
దీపాళికి బాణసంచా కాల్చితే నేరుగా జైలుకు పంపుతామంటున్నారు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్. రూ.200 జరిమానాతో పాటు ఆర్నెల్ల పాటు జైలు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన..ఢిల్లీలో బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎవరు ఈ నిబంధనలు ఉల్లంఘించినా రూ.5000 జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 21న ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది ప్రభుత్వం. "బాంబులు పక్కన పెట్టి దీపాలు వెలిగించండి" అనే నినాదంతో ప్రచారం చేయనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్‌లో సెంట్రల్ పార్క్‌లో 51,000 దీపాలు వెలిగించనున్నారు. బాణసంచాపై నిషేధాన్ని అమలు చేసేందుకు 408 బృందాలు సిద్ధంగా ఉన్నాయని గోపాల్ రాయ్ తెలిపారు. ఏసీపీ కింద 210 బృందాలు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కింద 165 బృందాలు, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ కింద 33 బృందాలు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించేందుకు సెప్టెంబర్‌లోనే ఈ నిర్ణయం తీసుకుంది ఆప్ సర్కార్. వచ్చే ఏడాది జనవరి వరకూ బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఈ విషయం వెల్లడించారు. "ఢిల్లీ ప్రజల్ని కాలుష్య ముప్పు నుంచి తప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు.. అన్నింటిపైనా నిషేధం వర్తిస్తుంది. ఇలా కట్టడి చేయటం ద్వారా కాలుష్యాన్ని చాలా వరకూ కంట్రోల్ చేయొచ్చని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: Jayalalithaa Death Case: జయలలిత డెత్ మిస్టరీలో మరో ట్విస్ట్, వైరల్ అవుతున్న ఆడియో క్లిప్