Miss Universe Event 2024: ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ పోటీలో సౌదీ పోటీ చేయడం ఇదే తొలిసారి. మెక్సికోలో సెప్టెంబర్ 18వ తేదీన Miss Universe 2024 పోటీలో సౌదీకి చెందిన 27 ఏళ్ల మోడల్ రూమీ అల్ఖాతానీ పాల్గొననుంది. ఆమే స్వయంగా ఈ విషయం వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పోస్ట్ పెట్టింది. "మిస్ యూనివర్స్ 2024 పోటీలో పాల్గొంటుండడం చాలా ఆనందంగా ఉంది. ఈ పోటీలో సౌదీ అరేబియా పాల్గొనడం ఇదే తొలిసారి" అని పోస్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడల్స్‌కి సరైన అవకాశాలు చూపించాలనే థీమ్‌తో ఈ సారి పోటీలు నిర్వహించనున్నారు. 


 






ఎవరీ సుందరి..?


సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో పుట్టి పెరిగింది రూమీ అల్ఖాతానీ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొంది. ఇటీవల మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్ (Miss and Mrs Global Asian) ఈవెంట్‌లో పోటీ చేసింది. ప్రపంచ దేశాల సంస్కృతుల గురించి తెలుసుకోవడంతో పాటు సౌదీ అరేబియా సంస్కృతిని మిగతా దేశాలకు తెలియజేసేందుకు ఈ పోటీల్ని వేదికగా మార్చుకుంటున్నట్టు రూమీ చెబుతోంది. మిస్ సౌదీ అరేబియా, మిస్ మిడిల్ ఈస్ట్ సౌదీ అరేబియా (Miss Middle East Saudi Arabia), Miss Arab World Peace 2021 తో పాటు Miss Woman Saudi Arabia కిరీటాల్ని గెలుచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రూమీకి 10 లక్షల మంది, ట్విటర్‌లో 2 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. Miss Universe 2023 పోటీలో మిస్ నికరగువా (Miss Nicaragua) కిరీటాన్ని గెలుచుకుంది.


సౌదీలో ఊహించని మార్పులు..


సంప్రదాయాలు, సంస్కృతి పేరుతో చాలా మటుకు తనకు తానే గీరి గీసుకున్న సౌదీ అరేబియా ఇప్పుడిప్పుడే మారిపోతోంది. ముఖ్యంగా మహమ్మద్ బిన్ సల్మాన్‌ (Mohammed Bin Salman) యువరాజుగా బాధ్యతలు తీసుకున్నాక ఈ మార్పు మొదలైంది. వేషధారణలో పూర్తిగా సంప్రదాయాన్ని అనుసరిస్తున్న బిన్ సల్మాన్...రూల్స్ విషయంలో మాత్రం కాస్త పట్టువిడుపుగానే ఉంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆంక్షల్ని పక్కన పెడుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా సౌదీ గురించి చర్చ జరుగుతోంది. మహిళల విషయంలో వస్తున్న మార్పులే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వాళ్లపై ఇన్నాళ్లు ఉన్న ఆంక్షల్ని తొలగించారు మహమ్మద్ బిన్ సల్మాన్. వాళ్లూ డ్రైవింగ్ చేసేందుకు అనుమతినిచ్చారు. మగవాళ్లు, ఆడవాళ్లు కలిసి ఫంక్షన్‌లలో పాల్గొనేందుకూ ఓకే చెప్పారు.


Also Read: Cash in Washing Machine: వాషింగ్ మెషీన్‌లో నోట్ల కట్టలు, షాక్ అయిన ఈడీ అధికారులు