Cash in Washing Machine: పలు నగరాల్లో సోదాలు చేపట్టిన ఈడీ రూ.2.54 కోట్ల నగదుని సీజ్ చేసింది. Foreign Exchange Law నిబంధనల్ని ఉల్లంఘించిన కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టింది. ఇందులో భారీ మొత్తం వాషింగ్ మెషీన్‌లో కనిపించింది. ఇది చూసి అధికారులు షాక్ అయ్యారు. పలు సిటీల్లోని కంపెనీల్లో ఈ సోదాలు జరిగాయి. ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, కోల్‌కత్తా, హరియాణాలోని కురుక్షేత్రలో ఈ సోదాలు జరిగాయి. కొద్ది రోజులుగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ చోట వాషింగ్‌ మెషీన్‌లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు కనిపించాయి. అయితే...ఎక్కడి నుంచి ఈ నగదుని స్వాధీనం చేసుకున్నారన్న వివరాలు మాత్రం ఈడీ అధికారులు వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగానే ఈ సోదాలు చేపట్టినట్టు తెలిపారు. భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. సింగపూర్‌లోని రెండు కంపెనీలకు దాదాపు రూ.1,800 కోట్లు చెల్లింపులు జరిపినట్టు గుర్తించారు అధికారులు. ఈ నగదుతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్స్‌, డిజిటల్ డివైజ్‌లను సీజ్ చేశారు. మొత్తం 47 బ్యాంక్ అకౌంట్‌లను ఫ్రీజ్ చేశారు.