Delhi Liquor Policy Case: ఈడీ అరెస్ట్‌ని, కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు. ఈడీకి నోటీసులు పంపుతామని వెల్లడించారు. అయితే...కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఈడీ కావాలనే విచారణలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్‌కి వెంటనే ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అటు ఈడీ తరపున న్యాయవాదులూ తమ వాదన వినిపించారు. కేజ్రీవాల్ బెయిల్‌ పిటిషన్ కాపీ తమకు ఆలస్యంగా అందిందని, దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చేందుకు మూడు వారాల సమయం కావాలని కోరారు. ఆ బెయిల్‌ పిటిషన్‌ని ఈడీ వ్యతిరేకించింది. సరైన విధంగా విచారణ జరపకుండానే కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారంటూ ఆయన తరపున న్యాయవాది వాదించారు. కావాలనే లోక్‌సభ ఎన్నికల ముందు అరెస్ట్ చేశారని ఆరోపించారు. మనీలాండరింగ్ యాక్ట్‌లోని సెక్షన్ 50 కింద కేజ్రీవాల్ నుంచి ఈడీ ఎలాంటి వాంగ్మూలం తీసుకోలేదని అభిషేక్ సింఘ్వీ వాదించారు. కేవలం ఆరోపణల ఆధారంగా ఆయనను అరెస్ట్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. 






మానవహక్కుల్ని ఉల్లంఘించి తనను అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. నేరాన్ని నిరూపించడంలో ఈడీ విఫలమైందని తేల్చి చెప్పారు. ఎలాంటి విచారణ జరపకుండానే అరెస్ట్ చేయడాన్ని చూస్తుంటే..ఇది కచ్చితంగా రాజకీయ కుట్రలాగే కనిపిస్తోందని ఆరోపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తనను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే..దీనిపై తరవాత విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది. ఈడీ మూడు వారాల సమయం అడగడాన్నీ కేజ్రీవాల్ లీగల్ టీమ్ వ్యతిరేకించింది. అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఇలా గడువు అడిగి అనవసరంగా విచారణని జాప్యం చేస్తున్నారని మండి పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కుల్నీ అణిచివేసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. అంతకు ముందు తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. ఆ తరవాత వెనక్కి తీసుకున్నారు. ముందు హైకోర్టులో తేల్చుకుంటానని వెల్లడించారు. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు పలువురు ఆప్‌ నేతల ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు.