Virat Kohli opens up on his two month break : టీమిండియా స్టార్‌ ఆటగాడు. కింగ్ విరాట్‌ కోహ్లీ(Virat Kohli)  రెండు నెలలపాటు  క్రికెట్‌కు దూరం కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిపై రకరకాల ఊహగానాలు చెలరేగాయి. క్రికెట్‌ ప్రపంచం మొత్తం విరాట్‌ ఏమయ్యాడు.. ఎక్కడికి వెళ్లాడు.. లాంటి ప్రశ్నలు చాలా వచ్చాయి. దీనిపై తొలిసారి విరాట్‌ కోహ్లీ స్పందించాడు. రెండు నెలలపాటు ఆటకు దూరంగా కుటుంబంతో గడపడం తనకు సరికొత్త అనుభూతిని పంచిందని నాటి ఘటనలను విరాట్‌ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తాము అసలు భారత్‌లో లేమని తమను ఎవరూ గుర్తుపట్టని చోట రెండు నెలలపాటు సాధారణ జీవితం గడిపామని విరాట్‌ తెలిపాడు. నిజంగా అదో అనిర్వచనీయమైన అనుభూతని అన్నాడు. రోడ్లపై తిరుగుతున్నా ఎవరూ గమనించకపోవడం కొత్తగా అనిపించింద’ని కోహ్లీ చెప్పాడు. 


రెండు నెలల తర్వాత
కోహ్లి వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు తొలుత కథనాలు వచ్చాయి. అయితే భార్య అనుష్క శర్మ ప్రసవం కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లేందుకు కోహ్లి విరామం తీసుకున్నట్లు తర్వాత స్పష్టమైంది. కోహ్లి, అనుష్క దంపతులకు ఇప్పటికే ఓ కూతురున్న సంగతి తెలిసిందే. విరాట్‌ సతీమణి అనుష్క శర్మ ఇటీవల లండన్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ బిడ్డకు అకాయ్‌ అనే పేరును పెట్టినట్లు విరాట్‌, అనుష్కశర్మలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కుటుంబంతో గడిపేందుకు లండన్‌ వెళ్లిన కోహ్లీ.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.


హాఫ్‌ సెంచరీల సెంచరీ
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు కింగ్‌ కోహ్లీ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ 20 కెరీర్‌లో వందో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో... కోహ్లీ ఈ ఘనత సాధించాడు. టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. టీ20ల్లో 100వ సారి 50 పరుగుల మార్కును దాటిన భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి టీ20లో 12 వేల పరుగులను అధిగమించాడు. టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ 2024(IPL)లో తొలి మ్యాచులో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. టీ20 క్రికెట్‌లో 12000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా నిలిచాడు. మొత్తంగా టీ20ల్లో 12000 పరుగులు చేసిన నాలుగో ప్లేయర్ విరాట్. టీ20 కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసి ఆటగాడిగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 14,562 ప‌రుగులు చేశాడు. తర్వాత పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్ షోయ‌బ్ మాలిక్ 12,993 పరుగులు, కీర‌న్ పోలార్డ్ 12,430 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు.