ED Arrests Delhi Health Minister : ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన ఆప్ అధినేత కేజ్రీవాల్ కేబినెట్‌లో అత్యంత ముఖ్యమైన మంత్రి. ఆయనపై హవాలా ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించిన హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో సత్యేందర్ జైన్‌ను అరెస్ట్ చేసినట్టుగా ఈడీ అధికారులు ధ్రువీకరించారు.
సత్యేందర్ జైన్ కుటుంబానికి చెందిన కొన్ని కంపెనీలపై ఈడీ ఇటీవల విచారణ జరుపుతోంది. కొన్ని చోట్ల సోదాలు నిర్వహించింది. కోల్‌కతాలో కొన్నిసోదాలు నిర్వహించినప్పుడు అక్కడి కంపెనీ సాయంతో మనీ లాండరింగ్ నిర్వహించినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. సోదాలు జరిపినప్పుడే దాదాపుగా రూ. నాలుగు కోట్ల 81 లక్షల సొమ్ము సత్యేందర్ జైన్ కుటుంబానికి చెందిన సంస్థల్లోకి అక్రమంగా వచ్చినట్లుగా గుర్తించారు. ఈ సొమ్మును అప్పుడే అటాచ్ చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు.
పంజాబ్‌లో కొత్తగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు లభించడంతో ఆయనను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయించారు. ఏసీబీ కేసులు నమోదు చేయించారు. ఇప్పుడు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలోని మంత్రి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ అరెస్ట్ చేశారు. ఆప్ అధికారంలో ఉన్న ప్రభుత్వాల్లో ఒక్కో మంత్రి అరెస్టయ్యారు.
అయితే సత్యేందర్ జైన్‌కు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుని .. తమ పార్టీ నేతలను వేధిస్తోందని అంటున్నారు. సత్యేందర్ జైన్ హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లకుండానే ఈ కేసు పెట్టారని అంటోంది.
సత్యేందర్ జైన్ అరెస్ట్ అంశం కొన్ని రోజుల పాటు రాజకీయంగా హాట్ టాపిక్‌గా ఉండే అవకాశం ఉంది.