Sanjay Raut:
పల్లెత్తు మాట అనని రౌత్..
జైలు నుంచి బయటకొచ్చిన వెంటనే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కేంద్రంపై విరుచుకు పడతారని భావించారంతా. ఈడీ తనపై అక్రమంగా అభియోగాలు మోపిందని విమర్శిస్తారనీ అనుకున్నారు. కానీ ఆయన మాత్రం..చాలా కూల్‌గా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. పైగా తనకు ఎవరిపైనా కోపం లేదని శాంతంగా మాట్లాడారు. ఇదంతా ఒక ఎత్తైతే...డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను పొగడటమే కాకుండా ఆయనను కలుస్తానని కూడా చెప్పటం మరో ట్విస్ట్. ఠాక్రే ప్రభుత్వాన్ని కుప్ప కూల్చింది బీజేపీయేనని అంతలా విరుచుకు పడిన సంజయ్ రౌత్, ఇప్పుడింత సాఫ్ట్‌గా ఎందుకు మారారన్నదే ఆసక్తికర ప్రశ్న. నిజానికి...ఠాక్రే వర్గంలో బీజేపీపై గట్టిగా విమర్శలు చేసింది సంజయ్ రౌత్ మాత్రమే. ఠాక్రే కన్నా ఎక్కువగా స్పందిస్తూ తన స్వరం వినిపించారు. కానీ...జైలుకెళ్లొచ్చాక మాత్రం ఈ వైఖరిలో మార్పు వచ్చిందని ఆయన మాటల్లోనే స్పష్టమవుతోంది. జైలు నుంచి వచ్చి రాగానే ఠాక్రేను కలిశారు సంజయ్ రౌత్. ఆయన ఆత్మీయంగా కౌగిలించుకుని మరీ రౌత్‌కు స్వాగతం పలికారు. సీన్ కట్ చేస్తే...అటు ఠాక్రే ఈడీ, కేంద్రంపై గట్టిగానే విమర్శలు చేస్తున్నా...ఇటు రౌత్ మాత్రం పూర్తిగా మెతకగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందని, వాటిని స్వాగతిస్తున్నాననీ
స్పష్టం చేశారు సంజయ్ రౌత్. శిందేపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే..ఫడణవీస్‌ను పొగిడారు. ఫడణవీస్ మాత్రమే రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తు న్నారని కితాబునిచ్చారు కూడా. త్వరలోనే పీఎం నరేంద్ర మోడీని, కేంద్రమంత్రి అమిత్‌షాను కలుస్తానని చెప్పడమూ రాజకీయంగా
కొత్త చర్చలకు తెర తీసింది.
ప్రశంసలు..
"దేవేంద్ర ఫడణవీస్‌ను కలుస్తాను. ఆయనే రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి (ఏక్‌నాథ్ శిందే) కేవలం ఈ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే తప్ప ఏ పార్టీకి చెందిన వారు కాదు" అని వ్యాఖ్యానించారు రౌత్. ఫడణవీస్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షానూ కలుస్తానని చెప్పారు సంజయ్ రౌత్. తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వాళ్లకు వివరిస్తానని అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న పరిస్థితులనూ వాళ్లకు అర్థమయ్యేలా చెబుతానని తెలిపారు. తనను కుట్ర పన్ని ఈ స్కామ్‌లో ఇరికించారని ఆరోపించారు. ఎవరిపైనా నేరుగా విమర్శలు చేయనని, ప్రభుత్వం మారాకే ఇదంతా జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందని, వాటిని తప్పకుండా ఆహ్వానిస్తానని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌ను కూడా కలుస్తానని వెల్లడించారు.
పత్రా చాల్ స్కామ్ కేసులో భాగంగా ఆయనను ఈడీ అధికారులు మూడు నెలల క్రితం అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. ఆయనను ముంబయిలోని జైల్లో ఉంచారు. PMLA కోర్ట్ ఆయన జ్యుడీషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగిస్తూ నవంబర్ 2న నిర్ణయం తీసుకుంది. రౌత్ బెయిల్ పిటిషన్‌ను రిజర్వ్‌లో ఉంచింది. ఇటీవలే..బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది. అరెస్ట్ అయ్యాక దాదాపు 101 రోజుల తరవాత బెయిల్ లభించినట్టైంది.
Also Read: Tamil Nadu Rains: తమిళనాడులో వరుణుడి బీభత్సం- 23 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్!