Sachin Pilot Vs Gehlot:


రాజస్థాన్‌లో విభేదాలు..


రాజస్థాన్ కాంగ్రెస్‌లో విభేదాలను తగ్గించేందుకు అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తోంది. కానీ..అవి ఓ కొలిక్కి రావడం లేదు. కనీసం ఖర్గే అయినా..ఈ బాధ్యత తీసుకుంటారనుకుంటే..ఆయనా సైలెంట్ అయిపోయారు. రాహుల్ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర వచ్చే నెల రాజస్థాన్‌లోకి ప్రవేశించనుంది. ఆ సమయంలోనే..రాహుల్ తమ సమస్యలు పరిష్కరించాలని భావిస్తోంది రాష్ట్ర క్యాడర్. డిప్యుటీ సీఎం సచిన్ పైలట్ కూడా ఇదే విషయాన్ని ఇప్పటికే అధిష్ఠానానికి తెలియజేశారు. "ఏదో ఓ స్పష్టత ఇవ్వండి" అంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్టీలోని సమస్యలు తీర్చకుండా జోడో యాత్ర కొనసాగించటం సరికాదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం ఓ కీలక విషయం వెల్లడించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తరవాతే రాజస్థాన్ రాజకీయ సంక్షోభాన్ని డీల్ చేస్తామని తెలిపింది.  డిసెంబర్ తొలి వారంలో మధ్యప్రదేశ్‌ నుంచి నేరుగా రాజస్థాన్‌లోని జలావర్‌ ప్రాంతానికి చేరుకుంటారు రాహుల్ గాంధీ. దాదాపు 20 రోజుల పాటు రాష్ట్రంలోని జలావర్, కోట, స్వామి మధోపుర్, దౌస్, అల్వార్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం పదవి తనకే దక్కాలని సచిన్ పైలట్ భావించినా..సీనియర్లకు గౌరవం ఇవ్వాలంటూ అశోక్ గహ్లోట్‌కు ఆ పదవి కట్టబెట్టింది అధిష్ఠానం. దీనిపై నాలుగు సంవత్సరాలుగా అసంతృప్తిగానే ఉన్నాడు సచిన్ పైలట్. 


అజయ్ మేకన్ లెటర్..


రాజస్థాన్ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఇప్పటికే సచిన్ పైలట్, సీఎం అశోక్ గహ్లోట్ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే  కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాజస్థాన్ స్టేట్ ఇన్‌ఛార్జ్ అజయ్ మేకెన్ అధిష్ఠానానికి షాక్ ఇచ్చారు. పదవిలో కొనసాగేందుకు ఆసక్తిగా లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఓ లేఖ రాశారు. "రాజస్థాన్ స్టేట్ ఇంచార్జ్‌గా
కొనసాగడం నాకు ఇష్టం లేదు" అని తేల్చి చెప్పారు అజయ్ మేకెన్. ఈ ఏడాది సెప్టెంబర్ 25న గహ్లోట్, సచిన్ పైలట్ వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు, రాజస్థాన్‌కు కొత్త సీఎం రావాలన్న డిమాండ్‌ వినిపించటం లాంటి పరిణామాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. త్వరలోనే భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌కు చేరుకోనుందని, ఈ లోగా రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్‌ను నియమించటం ఉత్తమం అని సూచించారు. 
రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలను తగ్గించలేకపోయానని, రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్‌ కావాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోందని అన్నారు.  ప్రస్తుతానికి ఖర్గే రాజస్థాన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదని తెలుస్తోంది.


గహ్లోట్‌ను సీఎం కుర్చీ నుంచి పక్కకు తప్పించడంపై మల్లికార్జున్ ఖర్గే ఏ మాత్రం ఆసక్తిగా లేరని సమాచారం. అంటే...పరోక్షంగా సచిన్ పైలట్ వర్గాన్ని "సైలెంట్‌"గా ఉండమని హెచ్చరించినట్టే. రాజస్థాన్ రాజకీయాల్లో అలజడి రేపిన గహ్లోట్‌పై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం భావించటం లేదట. ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక...అశోక్ గహ్లోట్‌తో భేటీ అయ్యారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. ఆ సమయంలోనే పైలట్ విషయం ప్రస్తావించి ఉంటారని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనేదీ చర్చించారట. 


Also Read: Rajiv Gandhi Assassination Case: రాజీవ్ హత్య కేసులో సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ అసహనం, త్వరలోనే రివ్యూ పిటిషన్