Rajiv Gandhi Assassination Case: 


రివ్యూ పిటిషన్‌కు కాంగ్రెస్ రెడీ..


రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేయడంపై కాంగ్రెస్ చాలా అసంతృప్తిగా ఉంది. ఆ పార్టీ సీనియర్ నేతలు ట్విటర్ వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇది సరైన నిర్ణయం కాదని విమర్శించారు. ఇప్పుడు సుప్రీం కోర్టుని ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని భావిస్తోంది కాంగ్రెస్. త్వరలోనే పిటిషన్ వేస్తారని తెలుస్తోంది. తీర్పుని సవాలు చేస్తూ రివ్యూపిటిషన్ వేయాలని నిర్ణయించుకుంది. "ఆ దోషులను విడుదల చేయడం చాలా దురదృష్టకరం" అని కాంగ్రెస్ మండి పడుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దోషులను విడుదల చేయడంపై అసహనంగానే ఉంది. ఇప్పటికే సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. 


శ్రీలంకకు నలుగురు..


రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు ఇటీవలే విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వీళ్ల ముక్తి లభించింది. వీళ్లను విడుదల చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా...తమకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు దోషులు. వీరిలో నలుగురు శ్రీలంకకు చెందిన వాళ్లున్నారు. వాళ్లను తమ సొంత దేశానికి పంపించే పనిలో ఉన్నారు అధికారులు. మురుగన్ అలియాస్ శ్రీహరన్, రాబర్ట్ పయాస్, ఎస్ జయకుమార్, శంతన్‌లను శ్రీలంకకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ...తమిళనాడు ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. ప్రస్తుతానికి ఈ నలుగురినీ...తమిళనాడులోని తిరుచ్చిలో ఓ స్పెషల్ క్యాంప్‌లో ఉంచారు. అయితే...లీగల్ ప్రోసీజర్ ఇంకా పూర్తి కాలేదని, అది పూర్తైతే కానీ వాళ్లను శ్రీలంకకు పంపడం కుదరదని అధికారులు చెబుతున్నారు. ఎప్పుడు పంపాలి అనే విషయంలో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా తేదీలైతే నిర్ణయించలేదు. ఈ హత్య కేసులో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన నళిన శ్రీహరన్...ఆ నలుగురినీ కలిశారు. ఆ తరవాతే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.


"ఈ నలుగురు శ్రీలంక వాసులను వాళ్ల దేశానికి పంపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. వీరిలో నా భర్త కూడా ఉన్నారు. జైల్లో నుంచి విడుదలైనా...ఈ స్పెషల్ క్యాంప్‌ మరో జైలులానే ఉంది" అని అన్నారు నళిని శ్రీహరన్. ప్రస్తుతానికి తిరుచ్చిలోని ఈ స్పెషల్ క్యాంప్ వద్ద పోలీసులు భద్రతను పటిష్ఠం చేశారు. ఈ మధ్యే నళిని శ్రీహరన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. "ఈ హత్య చేసినందుకు మీకు గిల్టీగా అనిపించడం లేదా" అని ప్రశ్నించగా...చాలా బ్యాలెన్స్‌డ్‌గా సమాధానం చెప్పారు నళిని. "అసలు నాకీ హత్యతో ఎలాంటి సంబంధం లేదు. ప్రపంచానికి నేనో దోషినే కావచ్చు. కానీ...అప్పుడేం జరిగిందో, నిజానిజాలేంటో నా మనస్సాక్షికి తెలుసు" అని బదులిచ్చారు.


Also Read: Russia Ukraine War: నిప్పుతో చెలగాటమాడుతున్నారని తెలుసుకోండి, ఉక్రెయిన్‌పై దాడులపై ఐరాస న్యూక్లియర్ చీఫ్‌ సీరియస్