Rajasthan Congress Crisis:


అసలైన రాహుల్‌ను జనం చూస్తున్నారు: వేణుగోపాల్


రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలకు "సరైన పరిష్కారం" దొరుకుతుందన్న నమ్మకముందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. "రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, పార్టీలోని అంతర్గత విభేదాలకు స్నేహపూర్వక పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాను" ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర గురించీ ప్రస్తావించారు. రాహుల్‌ని ప్రధాని చేయాలన్న ఉద్దేశంతో జరుగుతున్న యాత్ర కాదని స్పష్టం చేశారు. అలా చెప్పి ఈ యాత్ర విలువను తగ్గించలేనని అన్నారు. "చాలా ఏళ్లుగా బీజేపీ రాహుల్ గాంధీ ఇమేజ్‌కు మచ్చ తెచ్చేందుకు కుట్రలు చేస్తోంది. కానీ...ఇప్పుడు ప్రజలంతా అసలైన రాహుల్ గాంధీని చూస్తున్నారు. ఆయన బాగా చదుకున్న వాడు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవాడు, నమ్మినదాని కోసం నిలబడేవాడు" అని ప్రశంసలు కురిపించారు వేణుగోపాల్. భారత్ జోడో యాత్ర రాజకీయం కోసం కాదని తేల్చి చెప్పారు. రాజస్థాన్‌లోనూ జోడో యాత్ర విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 










పైలట్ వర్సెస్ గహ్లోట్ 


ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్..సచిన్‌ పైలట్‌పై విరుచుకు పడ్డారు. "మోసగాడు" అంటూ పదేపదే పైలట్‌ను ఉద్దేశిస్తూ తీవ్రంగా మండి పడ్డారు. "ఓ మోసగాడు ఎప్పటికీ ముఖ్యమంత్రి అవ్వలేడు" అని నిప్పులు చెరిగారు. "పార్టీ అధిష్ఠానం సచిన్ పైలట్‌ను సీఎం చేయలేదు. ఆయనకు కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేదు. ఆయన పార్టీకి నమ్మకద్రోహం చేశారు. అతనో మోసగాడు" అని విమర్శించారు. ఓ పార్టీ అధ్యక్షుడే తమ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేందుకు ప్రయత్నించడం దేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో సచిన్ పైలట్...సీఎం పదవి కోసం గహ్లోట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. ఆ అంశాన్నే ప్రస్తావిస్తూ గహ్లోట్ అసహనం వ్యక్తం చేశారు. గహ్లోట్ తనపై చేసిన వ్యాఖ్యలపై సచిన్ పైలట్ స్పందించారు. భాషను అదుపులో పెట్టుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. "కాస్త భాషను అదుపులో పెట్టుకోండి. అంత పెద్ద లీడర్ అయిన మీరు అలాంటి భాష వాడతారా" 
అని ఆగ్రహం వ్యక్తం చేశారు. "గహ్లోట్ నన్ను మోసగాడు మోసగాడు అంటే పదేపదే సంబోధించారు. ఇలాంటి వాటి వల్ల ఆయన సాధించేదేమీ లేదు" అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ను బలపరిచి..బీజేపీని ఢీకొట్టడంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించానని స్పష్టం చేశారు సచిన్ పైలట్. 
 


Also Read: Cricket World Cup 2023: 'మమ్మల్ని ఎవరూ శాసించలేరు'- రమీజ్ రజా వ్యాఖ్యలపై భారత క్రీడల మంత్రి స్పందన