Sachin Pilot:


నిరాహార దీక్ష 


సొంత పార్టీపై తిరుగుబాటు చేస్తున్న సచిన్‌ పైలట్ నిరాహార దీక్ష పూర్తి చేసుకున్నారు. ఇక తరవాత ఏం చేయనున్నారన్నదే ఆసక్తికరంగా మారింది. అధిష్ఠానాని ఝలక్ ఇచ్చే పనిలో ఉన్నారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా పార్టీ పెడతారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లడం ఈ ఆసక్తిని మరింత పెంచింది. అధిష్ఠానంతో స్పెషల్ మీటింగ్ ఉన్నట్టు సమాచారం. సీనియర్ నేతలతో సమావేశమవుతారన్న వార్తలు వినిపిస్తున్నా...దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ వివాదంపై పెద్దగా మాట్లాడటం లేదు. తమ ప్రభుత్వం అవినీతి పరులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ నిరాహార దీక్ష చేశారు పైలట్. ఇది హైకమాండ్‌ని అసహనానికి గురి చేస్తోంది. ఈ ఎపిసోడ్‌ మొత్తంలో సైలెంట్‌గా ఉన్న సీఎం అశోక్ గహ్లోట్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలున్నాయి. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...నిరాహార దీక్ష చేసిన సమయంలో పైలట్ కాంగ్రెస్ పేరుని కానీ గుర్తుని కానీ వాడుకోలేదు. సింగిల్‌గా ఓ స్టేజ్‌పై కూర్చుని దీక్ష చేశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు పైలట్ పరోక్షంగా సంకేతాలిచ్చారా..? అన్న సందేహమూ కలుగుతోంది. పైగా ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోట్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజేపై అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదని మండి పడ్డారు. 


"గత బీజేపీ ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగింది. అదే తప్పు మా హయాంలో జరగకుండా చూసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చాం. మా ప్రభుత్వం ఈ మాట నిలబెట్టుకుంటుందనే అనుకున్నాను. కానీ ఈ నాలుగేళ్లలో అది జరగనే లేదు. అవినీతిపై నా పోరాటం కొసాగుతుంది. "


- సచిన్ పైలట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే 


హైకమాండ్ సీరియస్..


నిరాహార దీక్ష మొదలు పెట్టిన కాసేపటికే పైలట్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో తనను తాను ముఖ్యమంత్రిగా చెప్పుకున్నారు. 
"కామన్ మేన్ సీఎం" అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 2029 నాటికి రాజస్థాన్ దేశంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని స్పష్టం చేశారు. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లోని ఇద్దరు కీలక నేతల మధ్య ఇలా విభేదాలు ముదురుతుండటం ఆ పార్టీ వర్గాల్ని కలవర పెడుతోంది. పైగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధిష్ఠానం ఎలక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటుంటే...అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ భారం అంతా గహ్లోట్‌పైనే వేసింది హై కమాండ్. మీరు మీరే తేల్చుకోండి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెబుతోంది. మీడియా ముందు, ప్రజల ముందు కాకుండా ఇలాంటి సమస్యలు అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. మొత్తానికి రాజస్థాన్ రాజకీయాల్లో త్వరలోనే కొత్త ట్విస్ట్‌ ఉండనుందన్న సంకేతాలు వస్తున్నాయి. 


Also Read: మరింత సాయం చేసి ఆదుకోండి- భారత్‌కు ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌ అభ్యర్థన