Russian Ukraine War:
రష్యాలో కలిపేందుకు అంతా సిద్ధం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తీసుకోనుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన పంతం నెరవేర్చుకునేందుకు ఉన్న దారులన్నీ వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే...ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తమ భూభాగంలో కలుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రష్యా టైమింగ్స్ ప్రకారం...శుక్రవారం మధ్యాహ్నం 3.00గంటల ప్రాంతంలో ఈ సైనింగ్ సర్మనీ ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ నేతృత్వం వహిస్తారు. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో అధికారికంగా విలీనం చేస్తూ సంతకాలు పెడతారు. రష్యా ప్రతినిధి డ్మిట్రీ పెస్కోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ ప్రాంతాలు దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్. అయితే...ఇవి ఉక్రెయిన్ భూభాగంలో ఉన్నప్పటికీ...అక్కడ మెజార్టీ ప్రజలు తాము రష్యాలో ఉండేందుకే ఆసక్తి చూపుతున్నామని చెప్పారు. రష్యా నిర్వహించిన ఓటింగ్‌లో ఇది తేలింది. నిజానికి..వీటిని స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తామని...ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలు పెట్టిన సమయంలోనే పుతిన్ ప్రకటించారు. ఇప్పుడు ఆ మేరకు ఆ ప్రక్రియ మొదలైంది. రష్యా అధికారికంగా ఆ ప్రాంతాలను తన భూభాగంలో విలీనం చేసుకోనుంది. తద్వారా ఉక్రెయిన్‌లో 15% భూభాగం రష్యాలో కలిసినట్టవుతుంది. ఈ విలీన ప్రక్రియ పూర్తయ్యాక...పుతిన్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఆ తరవాత రష్యా అధీనంలోకి వచ్చిన ఆ నాలుగు ప్రాంతాల్లో నియమించిన అధికారులను కలవనున్నారు.
రిజర్వ్స్ సేనలు..
ఉక్రెయిన్‌తో యుద్ధంపై పుతిన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా సైన్యంలోకి 3 లక్షల మంది 'రిజర్వ్స్' తిరిగి పిలుస్తున్నామన్నారు. గతంలో సైన్యంలో పని చేసి ప్రస్తుతం పౌర జీవితంలో ఉన్నవారిని 'రిజర్వ్స్' అంటారు. వీరి సేవలను ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో ఉపయోగించుకోనున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పుతిన్ అన్నారు.
" ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో 'రిజర్వ్స్' సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించాం. ఉక్రెయిన్‌లోని దోన్బస్ రీజియన్‌లో ఉన్న మా వారిని రక్షించుకోవడం రష్యా బాధ్యత. అలాగే దేశంలో ఆయుధాల ఉత్పత్తిని పెంచేందుకు నిధుల కేటాయింపును పెంచాం. ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలోని గల భూభాగాల్లోని ప్రజలు.. నియో నాజీల పాలనలో ఉండాలని కోరుకోవడం లేదు. వారికి స్వేచ్ఛ కల్పిస్తాం. పశ్చిమ దేశాలను రష్యాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. కానీ ఆ బెదిరింపులకు రష్యా తలొగ్గదు. ఎందుకంటే వారి హెచ్చరికలను ఎదుర్కొనే ఆయుధ సంపత్తి మా సొంతం. హద్దులు దాటిన ఐరోపా దేశాలు ఇది గుర్తు పెట్టుకోవాలి. మా ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లితే అణ్వాయుధాలను ప్రయోగించడానికి కూడా మేం వెనుకాడం. "
- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
అమెరికా ఆగ్రహం..
రష్యా చేసిన అణు హెచ్చరికలపై అమెరికా స్పందించింది. రష్యా అణు యుద్ధం మొదలు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా రష్యాపై విరుచుకుపడ్డారు. "నిబంధనలు ఉల్లంఘించి మరీ రష్యా యుద్ధానికి దిగటం సిగ్గుచేటు" అని తీవ్రంగా వ్యాఖ్యానించారు బైడెన్. ఇదే సమయంలో అణుయుద్ధాల గురించి ప్రస్తావించారు. ఈ యుద్ధాన్ని రష్యా గెలవలేదని, సైనిక చర్యని నియంత్రించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఐరాస భద్రతా మండలి (UN Security Council)తో మాట్లాడిన సందర్భంలో మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బైడెన్. "అణుయుద్ధాలు గెలవలేం. అసలు అలాంటి యుద్ధాలకు దిగటమే సరికాదు" అని అన్నారు. "బాధ్యతా రాహిత్యంగా అణుయుద్ధాల గురించి ప్రకటనలు చేస్తున్నారు" అంటూ రష్యాను విమర్శించారు.