Vladimir Putin on Nuclear Bombing:


పుతిన్ కామెంట్స్..


రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పశ్చిమ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తరచూ అణు దాడుల గురించి ప్రస్తావిస్తూ టెన్షన్ పెడుతున్న ఆయన...ఈసారి మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. ఖేర్సన్ నుంచి తమ బలగాలను వెనక్కి రప్పిస్తామని చెబుతూనే...అణుదాడుల గురించి చర్చించటం అంతర్జాతీయంగా అలజడి సృష్టిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో మాట్లాడిన సందర్భంలో జపాన్‌పై జరిగిన అణుదాడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు పుతిన్. ఇదే పశ్చిమ దేశాల నేతలను కలవరానికి గురి చేస్తోంది. "రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోవటానికి, జపాన్‌ సరెండర్ అయిపోటానికి కారణమైన అణుదాడులను చూస్తే ఓ విషయం స్పష్టమవుతోంది. విజయం సాధించటానికి పెద్ద నగరాలపైనే దాడి చేయాల్సిన పని లేదు" అని వ్యాఖ్యానించారు పుతిన్. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ అణుబాంబులు ప్రయోగిస్తారేమో అన్న భయం మొదలైంది. నిజానికి...ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు పెట్టినప్పటి నుంచే అణుదాడుల అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. అయితే...ఈ మధ్య కాలంలో పుతిన్ పదేపదే ఈ వ్యాఖ్యలు చేస్తుండటంపై అటు ఉక్రెయిన్‌ కూడా గట్టిగానే బదులిస్తోంది. రష్యా సైన్యంపై పోరాడుతోంది. రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై ఆరోపణలు చేస్తూ దాడులు తీవ్రతరం చేస్తోంది. ఖేర్సన్‌లో ఉక్రెయిన్‌ రేడియోయాక్టివ్ బాంబులు పెడుతోందని మండిపడుతోంది. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ "ఇదంతా కుట్ర" అని కొట్టి పారేస్తోంది. "తమకు తాముగా ప్లాన్ చేసుకుని, ఏవేవో ఊహించుకుని పక్క వాళ్లపై బురదజల్లడం రష్యాకు అలవాటే" అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 


వెయ్యి మంది సైనికులు మృతి..


ఉక్రెయిన్ వ్యూహాలు మార్చుకుంటూ ఎదురుదాడికి దిగుతోంది. ఇదే రష్యాకు మింగుడు పడటం లేదు. పుతిన్ కక్షతో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రిజర్వ్ బలగాలనూ రంగంలోకి దింపి ఉక్రెయిన్‌ మీదకు వదిలారు. అయినా...ఉక్రెయిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడుతోంది. ఈ పోరాటం ఫలితంగానే...రష్యా తమ సైనికులను కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఉక్రెయిన్ చెబుతున్న లెక్కల ప్రకారం గత 24 గంటల్లోనే వెయ్యి మంది రష్యా సైనికులు హతమయ్యారు. ఇప్పటి వరకూ జరిగిన యుద్ధంలో 71,200 మంది రష్యా సైనికులు తమ చేతిలో చనిపోయారని ఉక్రెయిన్ క్లెయిమ్ చేసుకుంటోంది. ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ చెబుతున్న ప్రకారం..24 గంటల్లో 1000 మంది రష్యన్ సైనికులు చనిపోయారు. బ్రిటీష్ డిఫెన్స్ ఇంటిలిజెన్స్‌ అంతకు ముందే ఈ ఘటనను ఊహించింది. రష్యా సైనికులు భారీ ఆయుధాలు లేకుండానే యుద్ధ రంగంలోకి దిగారని తేల్చి చెప్పింది. ఇప్పటికే రష్యా 41 వేల  రిజర్వ్‌ బలగాలను యుద్ధ క్షేత్రంలో మోహరించింది. గత నెల రష్యన్ సైనికులు ఓటమి చవి చూడటాన్ని గమనించిన పుతిన్..వెంటనే ఈ రిజర్వ్ బలగాలను రంగంలోకి దింపారు. అప్పటి నుంచి దాడులు, ప్రతిదాడులు పెరుగుతూ వస్తున్నాయి.


Also Read: PM Modi: మీ అందరికీ ఓ గుడ్ న్యూస్, ఆ చీతాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయ్ - ప్రధాని మోదీ ట్వీట్