Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాలో భాగమని మాస్కో ప్రకటించిన ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని పుతిన్ అన్నారు. రష్యా డ్రోన్‌లతో దాడి చేసిన తర్వాత కీవ్ మరిన్ని ఆయుధాలను సమీకరిస్తుందని పుతిన్ తెలిపారు. 


రష్యాలో ఘనంగా జరుపుకునే సెక్యూరిటీ సర్వీసెస్ డే సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమ సరిహద్దుల్లో భద్రతను పెంచాలని పుతిన్ ఆదేశించారు. 


విలీనం చేస్తూ


ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తమ భూభాగంలో కలుపుకుంటున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల సంతకం చేశారు. దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజియా, ఖేర్సన్‌ ప్రాంతాలను రష్యాలో అధికారికంగా విలీనం చేస్తున్నట్లు పుతిన్ సంతకం చేశారు. అయితే...ఇవి ఉక్రెయిన్‌ భూభాగంలో ఉన్నప్పటికీ...అక్కడ మెజార్టీ ప్రజలు తాము రష్యాలో ఉండేందుకే ఆసక్తి చూపుతున్నారని పుతిన్ అన్నారు.


రష్యా నిర్వహించిన ఓటింగ్‌లో ఇది తేలిందని తెలిపారు. నిజానికి..వీటిని స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తామని...ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలు పెట్టిన సమయంలోనే పుతిన్ ప్రకటించారు. రష్యా అధికారికంగా ఆ ప్రాంతాలను తన భూభాగంలో విలీనం చేసుకోనుంది. తద్వారా ఉక్రెయిన్‌లో 15% భూభాగం రష్యాలో కలిసినట్టవుతుంది. 


డ్రోన్ దాడులు


తాజాగా రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై డ్రోన్‌లతో దాడికి దిగింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కీవ్‌పై జరిగిన దాడుల్లో ఇదే అత్యంత ఘోరమైన దాడిగా ఉక్రెయిన్ వ్యాఖ్యానించిన తర్వాత రష్యా యుద్ధ తీవ్రతను పెంచింది.


20కి పైగా


దాదాపు  20కి పైగా ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం గగనతలంలో గుర్తించారు. వాటిలో పదిహేను డ్రోన్లను కూల్చివేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఈ దాడిలో కీలకమైన మౌలిక సదుపాయాలు ధ్వంసం అయినట్టు కీవ్ నగర పాలక సంస్థ పేర్కొంది. వీటితో పాటు కొన్ని ఇళ్లు ధ్వంసం కాగా, ఇద్దరికి గాయాలయ్యాయని అని కీవ్ నగర గవర్నర్ ఓలెక్సీ కులెబా తెలిపారు.



షెవ్చెంకివ్స్కీ, సోలోమియన్స్కీ రెండు జిల్లాల్లో పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో ఎవరూ మరణించలేదు.ఆ ప్రదేశాల్లో అత్యవసర సేవలు నిర్వహిస్తున్నారు. కీవ్ నగరం వారి ప్రధాన లక్ష్యం. దేశంలోని అన్ని ప్రాంతాలపై రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి                  "
-ఉక్రెయిన్ అధికారులు


అజోవ్ సముద్రం తూర్పు వైపు నుంచి రష్యా పంపించిన 35 డ్రోన్లలో 30కి పైగా నాశనం చేసినట్టు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. గత శుక్రవారం రష్యా ఉక్రెయిన్ పై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ దాడుల్లో భాగంగానే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై దాడి జరిగింది.


ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు శుక్రవారం 70కిపైగా క్షిపణులు ప్రయోగించాయి. వరుస పరాజయాల తర్వాత అక్టోబర్ నుంచి వారానికోసారి ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తుండగా యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు.