ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై భారత్ స్టాండేంటి? అనేది ఇప్పుడు ప్రపంచదేశాల మదిలో మెదులుతోన్న ప్రశ్న. యుద్ధాన్ని ఆరంభించిన రష్యాపై ఇప్పటికే అమెరికా, యూకే, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. రష్యాపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. భారత్ మాత్రం ఎప్పటిలానే శాంతిమంత్రాన్నే జపించింది. భారత విదేశాంగ సహాయ మంత్రి డా. రాజ్‌కుమార్ రంజన్ ఈ మేరకు ప్రకటించారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ న్యూట్రల్‌గా ఉంది. త్వరలోనే శాంతియుత వాతావరణం నెలకొనాలని మేం కోరుకుంటున్నాం. పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోంది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు ముఖ్యంగా విద్యార్థుల భద్రతే మాకు ప్రధానం. భారత విదేశాంగ శాఖ కంట్రోల్ రూమ్ 24x7 వారికి అందుబాటులో ఉంది. - డా. రాజ్‌కుమార్ రంజన్, భారత విదేశాంగ సహాయ మంత్రి
భారత్ సాయం కావాలి
మరోవైపు ఉక్రెయిన్ మాత్రం భారత్ సంపూర్ణ మద్దతు కావాలని కోరుతోంది. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు ఆ దేశ రాయబారి ఇగోర్ పొలిఖా పేర్కొన్నారు. తక్షణమే యుద్ధం నిలువరించే దిశగా భారత్ చర్యలు తీసుకోవాలి కోరారు. సంక్షోభ పరిష్కారానికి భారత ప్రధాని ముందుకు రావాలన్నారు.
రష్యా ఏకపక్ష దాడిని ప్రపంచ దేశాలు ఖండించాలి. భారత ప్రధాని తన పలుకుబడితో రష్యా దాడిని నిలువరించాలి. సంక్షోభ వేళ భారత్ అండగా నిలవాలి. జపాన్ సహా పలు దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించాయి. పరిస్థితులు క్షీణిస్తున్నందున ఉక్రెయిన్‌కు భారత్ మద్దతు ఇవ్వాలి. రష్యాతో భారత్‌కు సత్సంబంధాలు ఉండవచ్చు.. కానీ, సంక్షోభ సమయంలో ఉక్రెయిన్‌కు భారత్ అండగా నిలవాలి. శక్తిమంతమైన నేతల్లో ఒకరైన మోదీ.. సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. - ఇగోర్ పొలిఖా, భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి
Also Read: Ukraine Russia War: యుద్ధం అయిపోయాక రష్యా పరిస్థితేంటి? పుతిన్ వ్యాఖ్యలకు అర్థమేంటి?
Also Read: Russia Ukraine War: రష్యా విమానాలు, హెలికాప్టర్ కూల్చేశాం - ఉక్రెయిన్ ప్రకటన, వారి ఎయిర్ డిఫెన్స్ మొత్తం నాశనం చేశాం: రష్యా