ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం రష్యా పర్యటనలోనే ఉన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆయన యుద్ధోన్మాదాన్ని చాటుతోంది.
‘‘ప్రస్తుత పరిస్థితులు నాకు ఎంతో ఎక్సైట్‌మెంట్ కలిగిస్తున్నాయి.’’ అని ఇమ్రాన్ ఖాన్ రష్యా అధికారులతో అంటున్న వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఇమ్రాన్ తొలిసారిగా రష్యా పర్యటనకు వచ్చారు. మాస్కోలో తాను విమానం దిగిన వెంటనే స్వాగతం పలికేందుకు ఉన్నతాధికారులు వచ్చారు. ఆ సమయంలోనే ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సరైన సమయంలోనే నేను రష్యాకు వచ్చాను. ఈ పరిస్థితులు ఎంతో ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ నుంచి ప్రధాని ఇమ్రాన్ రెండు రోజుల పర్యటన కోసం రష్యాకు వెళ్లారు. ఇలా ఒక పాక్ ప్రధాని రష్యా పర్యటనకు వెళ్లడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ పర్యటనలో పాకిస్థాన్ - రష్యా ద్వైపాక్షిక సంబంధాలు సహా ఎనర్జీ సెక్టర్‌లో సహకారం బలోపేతం చేసుకొనే దిశగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరపనున్నారు.
రష్యాపై మక్కువ చూపుతున్న పాక్
పాకిస్థాన్ తొలి నుంచి అమెరికాతో సఖ్యతగా ఉండేది. ఉగ్రవాద కార్యకలాపాలు నియంత్రించేందుకు గానూ పాకిస్థాన్‌కు అమెరికా ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అందించేది. కానీ తాలిబన్లకు సహకరిస్తున్నారనే నెపంతో అమెరికా పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో ఆర్థిక ఆంక్షలు విధించింది. డిఫెన్స్ సహా ఇతర అవసరాలకు అమెరికా అందించే ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్ ఇప్పుడు ఆర్థిక, రక్షణ అవసరాల కోసం రష్యావైపు చూస్తోంది. అందుకే ఇరు దేశాల సంబంధాలు బలోపేతం దిశగా చర్చల కోసం ఇమ్రాన్ ఖాన్ రష్యాకు వచ్చారు. ఆ సందర్భంగానే ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు చేశారు.