ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ఖండించాయి. గురువారం ఉదయం టెలివిజన్ ప్రసంగంలో పుతిన్ ప్రకటించిన దాడి కారణంగా రష్యాపై భారీ ఆంక్షలు ఉంటాయని హెచ్చరించారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జస్టిన్ ట్రూడో, బోరిస్ జాన్సన్, జెన్స్ స్టోల్టెన్‌బర్గ్‌లతో సహా ప్రపంచ నాయకులు స్పందించారు.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ప్రకటించిన 30 నిమిషాల్లోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పేలుళ్లు వినిపించాయి. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఈ దాడిని ఖండించారు. రష్యా ఈ దాడికి సమాధానం చెప్పాలని హెచ్చరించారు. రష్యా చర్య "విపత్తు, ప్రాణ నష్టం, మానవ బాధలకు" కారణమవుతుందని బిడెన్ అన్నారు. వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, యూఎస్ ప్రెసిడెంట్ ఇలా అన్నారు: “ఈ రాత్రి ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకంటే వారు రష్యా సైనిక బలగాలచే అన్యాయమైన దాడికి గురవుతున్నారు. పుతిన్ ముందస్తుగా నిర్ణయించిన యుద్ధాన్ని ఎంచుకున్నాడు, అది విపత్తు, ప్రాణనష్టం, మానవ బాధలను తెస్తుంది. ఈ దాడి వల్ల జరిగే విధ్వంసానికి రష్యా మాత్రమే బాధ్యత వహిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ దాని మిత్రదేశాలు, భాగస్వాములు ఐక్యంగా నిర్ణయాత్మక మార్గంలో స్పందిస్తాయి.
ఉక్రెయిన్ పై దాడికి యునైటెడ్ స్టేట్స్, మిత్రదేశాలు రష్యాపై విధించే తదుపరి పరిణామాలను ప్రకటించడానికి రేపు ఉదయం G7 సహచరులతో సమావేశమై, అమెరికన్ ప్రజలతో కూడా మాట్లాడతానని బిడెన్ చెప్పారు. “అలెయన్స్‌కు వ్యతిరేకంగా దూకుడును నిరోధించిండానికి మేము NATO మిత్రదేశాలను సమన్వయం చేసుకుంటాం. ఈ రాత్రి నేను ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం”అని బిడెన్ అన్నారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ ప్రకటన విడుదల చేశారు. "ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దారుణమైన దాడిని కెనడా ప్రజలు ఖండిస్తున్నారు. ఈ చర్యలు ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు స్పష్టమైన ఉల్లంఘన. అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం రష్యా బాధ్యతలను ఉల్లంఘించింది. "ఉక్రెయిన్‌కు వ్యతిరేక చర్యలను వెంటనే నిలిపివేయాలని దేశం నుంచి అన్ని సైనిక దళాలను ఉపసంహరించుకోవాలని కెనడా రష్యాను కోరింది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత తప్పనిసరిగా గౌరవించాలని, ఉక్రేనియన్ ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి స్వేచ్ఛ ఉందన్నారు. రష్యా చర్యలపై రేపు G7 భాగస్వాములతో చర్చిస్తాం. అదనంగా ఆంక్షలు విధిస్తాం" అని ట్రూడో అన్నారు.
యూకే ప్రధాని బోరిస్ జాన్సన్
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఒక ట్వీట్‌లో ఇలా అన్నారు: “ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తదుపరి చర్యల గురించి చర్చించడానికి అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడాను. అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై ఈ అకారణ దాడిని ప్రారంభించారు. పుతిన్ రక్తపాతం, విధ్వంస మార్గాన్ని ఎంచుకున్నారు. యూకే మిత్రదేశాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయి.
యూఎన్ సెక్యూరిటీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్
యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఒక ట్వీట్‌లో ఇలా అన్నారు. “ నేను విజ్ఞప్తి చేస్తున్నాను: అధ్యక్షుడు పుతిన్ మానవత్వంతో ఆలోచించి మీ దళాలను రష్యాకు తిరిగిపంపండి. ఈ గొడవ ఇప్పుడు ఆగాలి.' అని అన్నారు.