రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కాస్త చల్లారినట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో మోహరించిన తమ బలగాలు స్థావరాలకు వెనుదిరుగుతున్నాయని రష్యా ప్రకటించింది. కానీ రష్యా ఏ నిమిషంలోనైనా ఉక్రెయిన్‌పై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా పేర్కొంది.
శాంతి చర్చలు
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను దౌత్యచర్చల ద్వారా అడ్డుకునేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నిస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ సహా ఐరోపా దేశాలు ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపాయి. అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గినట్లు కనిపించలేదు. కానీ అనూహ్యంగా రష్యా బలగాలను వెనక్కి రప్పించడంతో ఉద్రిక్తతలు తగ్గినట్లు కనిపిస్తున్నాయి.
చుట్టుముట్టి
ఉక్రెయిన్ సరిహద్దులో లక్షా 30 వేలకు పైగా సైన్యాన్ని రష్యా మోహరించింది. ఉత్తర, దక్షిణ, తూర్పు సరిహద్దులన్నింటినీ చుట్టుముట్టింది. ఉక్రెయిన్ సరిహద్దును పంచుకునే బెలారస్లో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. దీంతో యుద్ధం అనివార్యమనే ఆందోళనలు మొదలయ్యాయి. అమెరికా నిఘావర్గాలు కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి.
Also Read: Ukraine Russia Conflict: తట్ట, బుట్ట సద్దుకొని ఆ దేశం నుంచి వచ్చేయండి: భారత పౌరులకు కేంద్రం అలర్ట్