Russia supports India amid India-Pakistan tensions: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ఏర్పడిన ఉద్రిక్తల మధ్య భారత్ కు ప్రపంచదేశాల సపోర్టు లభిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని "హీనమైన చర్య"గా కఠినంగా ఖండించారు. ఈ దాడి బాధ్యులైన వారిని శిక్షించి తీరాలని అన్నారు. వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోమవారం ఫోన్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద దాడిపై దర్యాప్తులో రష్యా, చైనా ప్రమేయం ఉండాలని పాకిస్తాన్ కోరుకుంది. అయితే అనూహ్యంగా రష్యా భారత్ కు మద్దతు పలికింది.
ఫోన్ కాల్‌లో భారతదేశాన్ని సందర్శించాలని ప్రధాని మోడీ ఇచ్చిన ఆహ్వానాన్ని అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. ఈ విషయానని అధ్యక్ష అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. రష్యా, భారతదేశం మధ్య సంబంధాలు డైనమిక్‌గా అభివృద్ధి చెందుతున్నాయని ఇద్దరు నాయకులు నొక్కి చెప్పారని క్రెమ్లిన్ తెలిపింది.
పహల్గంాం దాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్ కోరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. వ్యూహాత్మక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఇద్దరు నాయకులు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.
ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ రష్యా, చైనా లేదా పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్ కు మద్దతుగా ఉంటాయన్నట్లుగా ప్రకటనలు చేశారు. ఇలా చెప్పిన కొన్ని రోజుల తర్వాత రష్యా అధ్యక్షుడు ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా అంతర్జాతీయ దర్యాప్తుకు అనుకూలంగా ఉన్నారని పాక్ మంత్రి అన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) ప్రతినిధి రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏప్రిల్ 22 దాడికి బాధ్యత వహించింది. అయితే తర్వాత ఖండించింది.
భారత్ సైనిక దాడి చేస్తుందని గట్టిగా భయపడుతున్న పాకిస్తాన్ వీలైనంత వరకూ తప్పించుకునేందుకు ఇతరదేశాల సాయం కోరుతోంది. విచారణకు తాము సిద్ధమేనని అంటున్నారు. భారత్ ఆరోపణలు చేస్తోంది కానీ.. ఆధారాలు చూపించడం లేదని వాదిస్తున్నారు.