న్యూఢిల్లీ: కుల గణన నిర్వహించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపడతామని ఇటీవల స్పష్టం చేసింది. కుల గణనకు సంబంధించి రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు ఇది తమ విజయమని చెబుతున్నారు. అయితే 'సంవిధాన్ బచావో ర్యాలీ' సందర్భంగా కుల గణనను కేంద్రం జాప్యం చేయకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 15 (5) ను అమలు చేయాలని గత వారం CWC సమావేశంలో చేసిన డిమాండ్లను లేవనెత్తాలని AICC ప్రధాన కార్యదర్శి కేసీ  వేణుగోపాల్ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ విభాగాలను ఆదేశించారు.

రాహుల్ గాంధీ చేసిన కృషి, పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం కుల గణనకు నిర్ణయం తీసుకుందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వేణుగోపాల్ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు సూచించారు. కానీ గతంలో న్యాయ మంత్రిత్వ శాఖ కుల గణన చేపట్టాలని యూపీఏ హయాంలో సూచించగా అప్పటి కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దశబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ సమయంలో సమగ్ర కుల గణనను నిర్వహించని కారణంగానే దేశంలో కీలకమైన డేటా అందుబాటులో లేకుండా పోయిందని ఆరోపణలున్నాయి. 

కుల గణనతో ఇతర వెనుకబడిన తరగతులు (OBC), జనరల్ కేటగిరీతో సహా అన్ని కులాల జనాభా లెక్కలతో పాటు వారి ఆర్థిక స్థితిగతుల గురించి కీలకమైన సమాచారం లభిస్తుంది. కానీ  కాంగ్రెస్ పలు రాజకీయ కారణాల వల్ల కుల గణనను విస్మరించింది.

కుల గణనపై గతంలో కాంగ్రెస్..స్వాతంత్ర్యంవచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జనాభా లెక్కలు చేసింది. కానీ కుల జనాభా గణన డిమాండ్‌ను విస్మరించింది. దాంతో కులాల వారిగా జనాభాపై డేటా అందుబాటులో లేదు. పలు రాజకీయ, సామాజిక కారణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వాలు కుల గణన చేటప్టలేదని రిపోర్టులు చెబుతున్నాయి.

1931: భారత్‌లో చివరిసారిగా కుల గణన చేపట్టారు. OBCలతో సహా అన్ని కులాల లెక్కలు తేల్చారు. అప్పటి నుండి, జనాభా లెక్కల్లో SC (షెడ్యూల్డ్ కులాలు), ST (షెడ్యూల్డ్ తెగలు) కు సంబంధించిన డేటా మాత్రమే అందుబాటులో ఉంది. సామాజిక న్యాయం, రిజర్వేషన్లకు, సంక్షేమ పథకాలకు కులాల జనాభా లెక్కలు చాలా ముఖ్యం. 

దశాబ్దాలుగా కాంగ్రెస్ ఏం చేసింది..1. 1947-1989: కాంగ్రెస్ ఆధిపత్యం కారణంగా కులాల వారీగా జనాభా లెక్కలు తేల్చలేదు. స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి 1989 వరకు దాదాపు కాంగ్రెస్ ఏకపక్షంగా పాలించింది. దాంతో ప్రధాన ప్రతిపక్షం లేని కారణంగా కుల గణన డిమాండ్ అంతగా రాలేదు. దాంతో కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ చొరవ తీసుకోలేదు.

పండిట్ జవహార్‌లాల్ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు కుల గణనను విస్మరించాయి. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు విభజన శక్తిగా భావించాయి. కులం కారణంగా సామాజిక విచ్ఛిన్నతకు దారితీస్తుందని భావించారు.

1990 దశకం: మండల్ కమిషన్ సిఫార్సులు, మరోవైపు కాంగ్రెస్ సైలెంట్ వి.పి. సింగ్ ప్రభుత్వం 1990లో మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసింది. దాంతో OBCలకు రిజర్వేషన్లు లభించాయి. కాంగ్రెస్ దానిని వ్యతిరేకించలేదు. తెలివిగా కుల గణన డిమాండ్‌ చేయకుండా మౌనం వహించింది. ఈ అంశాన్ని తన ప్రధాన ఎజెండాలో చేర్చలేదు.

2011: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సామాజిక, ఆర్థిక సర్వే యూపీఏ 2 హయాంలో మన్మోహన్ సింగ్ నేతృత్వం  2011లో సామాజిక- ఆర్థిక, కుల గణన (SECC) నిర్వహించింది. దాదాపు 80 ఏళ్ల తర్వాత మళ్ళీ కులాల వారీగా జనాభా లెక్కల సేకరణకు ఇది బీజం వేసింది. 

ఆ సర్వేలో లెక్కలు సేకరించారు. కానీ అది అస్తవ్యస్తంగా, అసంపూర్ణంగా, వివాదాస్పదంగా మారింది. దేశంలో 46 లక్షలకు పైగా కులాలు ఉన్నాయని.. ఒకే కులం ఒక్కో రాష్ట్రలో ఒక్కో తీరుగా ఉందని సర్వేలో పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం ఈ లెక్కలు వెల్లడించలేదు. 2015లో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో, కుల ఆధారిత డేటా బదులుగా.. సామాజిక-ఆర్థిక డేటా మాత్రమే ప్రచురించారు.

2014- 2020: ఏ డిమాండ్ లేదు..కాంగ్రెస్ 2014లో అధికారం కోల్పోయింది. ప్రతిపక్షంలో ఉన్నా కూడా, కుల గణనకు సంబంధించి ఏ డిమాండ్ చేయలేదు. దానిపై స్పష్టమైన విధానం సైతం లేదు. 

2021 నుంచి నేటికి....2021 నుంచి కాంగ్రెస్ వైఖరి మారింది. ప్రాంతీయ పార్టీలు ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ, జేడీయూ,కుల గణనను డిమాండ్ చేయడంతో క్రమంగా కాంగ్రెస్ సైతం కుల గణనకు డిమాండ్ చేసింది. గత ఏడాది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ దీన్ని తమ ఆయుధంగా వాడుకోవాలని చూసింది. తాము అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం కోసం "కుల ఆధారిత జనాభా గణన" (Caste Census) అవసరమని రాహుల్ గాంధీ అన్నారు. జనాభా ప్రాతిపదికన హక్కులు, అవకాశాలు అని చెప్పారు. 

రాజకీయ, ఓటు బ్యాంకు కారణాలతో మౌనమా..కుల జనాభా లెక్కల డేటా సమాజంలో వర్గ విభజన చేసి బ్రహ్మణ, వైశ్యులు సహా అగ్ర కులాల ఓటు బ్యాంకు దూరమవుతుందని భావించారు. కుల గణన డేటా సామాజిక విభజనతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందని భావించడం.  

OBCల రాజకీయాల్లో కాంగ్రెస్ స్పష్టమైన విధానాన్ని పాటించలేదు. ఈ విషయంపై వారికి ఎలాంటి విధానం లేకపోయింది. వనరుల కొరత, డేటా నాణ్యత లాంటివి సాకుగా చూపుతూ కుల గణన జోలికి వెళ్లలేదు. 

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల మాట్లాడుతూ, "90 శాతం మంది ప్రజలు వ్యవస్థకు బయట ఉన్నారు. వారికి టాలెంట్ ఉన్నా అవకాశాలు రావడం లేదు. అందుకే, కుల గణన చేపట్టి అందరికీ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ సూచనల తరువాత దేశంలో కుల గణనపై ఆసక్తి నెలకొంది. ఆర్జేడీ, జేడీయూ, డీఎంకే లాంటి పార్టీలు ఇదే ఆలోచన చేయగా.. కాంగ్రెస్ వారికి మద్దతు ఇచ్చింది. 

యూపీఏ హయాంలో కులాల లెక్కలు వెల్లడి కాలేదుయూపీఏ 2 హయాంలో 2011-2012లో సామాజిక- ఆర్థిక, కుల గణన (SECC) నిర్వహించింది. దేశ వ్యాప్తంగా లెక్కలు తీసినా ప్రభుత్వం కులాల వారీగా జనాభా వివరాలను బహిర్గతం చేయలేదు. 2012లో సర్వే చేయగా, 2013లో డేటా రెడీ చేశారు. ఎన్నికల్లో నెగ్గాక డేటా విడుదల చేయాలనుకోగా.. 2014లో అధికారం కోల్పోవడంతో కులాల లెక్కలు బహిర్గతం కాలేదు.