Russia - India Fuel: భారత ఆర్థిక వ్యవస్థ నడకను నిర్ణయించడంలో చమురుది కీలక పాత్ర. చమురు రేట్లు పెరిగితే మన ఎకానమీ కుంటి గుర్రంలా పడుతూ, లేస్తూ పరిగెడుతుంది. వస్తు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతాయి. చమురు ధరలు తగ్గితే మన ఆర్థిక వ్యవస్థ కళ్లెం వదిలిన పంచకళ్యాణిలా దూసుకెళ్తుంది. అన్ని వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం తగ్గుతాయి.
అయితే మన దేశానికి అవసరమైన చమురులో దాదాపు 80 శాతాన్ని ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే, అంతర్జాతీయ మార్కెట్‌లో, ముడిచమురు ధరల్లో కనిపించే హెచ్చుతగ్గులు మన ఆర్థిక వ్యవస్థ మీద గణనీయమైన ప్రభావం చూపుతాయి. ప్రపంచంలో మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతి దేశం మనదే. చైనా మొదటి స్థానంలో ఉంది.
చమురు ఎగుమతి దేశాలు
మన దేశానికి... సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), రష్యా, నైజీరియా, అంగోలా, కెనడా, యుఎస్ సహా మరికొన్ని దేశాల నుంచి ముడి చమురు దిగుమతి అవుతుంది. నవంబర్ నెలలో... సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నైజీరియా, అంగోలా నుంచి వచ్చే దిగుమతులు తగ్గగా - కెనడా, యుఎస్ నుంచి దిగుమతులు పెరిగాయి.
వరుసగా రెండో నెల కూడా రష్యా ఫస్ట్
ఎనర్జీ కార్గో ట్రాకర్ ఓర్టెక్సా సేకరించిన డేటా ప్రకారం.. భారత్‌కు చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో ఇప్పుడు రష్యా అగ్ర స్థానంలో ఉంది. వరుసగా రెండో నెల (అక్టోబర్, నవంబర్) కూడా ఇది ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగింది. గతంలో 1, 2 స్థానాల్లో ఉన్న ఇరాక్, సౌదీ అరేబియా కన్నా ముందుకు దూసుకెళ్లింది.
ఓర్టెక్సా డేటా ప్రకారం, నవంబర్‌లో రోజుకు 909,400 బ్యారెల్స్ (bpd) ముడి చమురును మన దేశానికి రష్యా సరఫరా చేసింది. దేశం మొత్తం దిగుమతి 4.29 మిలియన్ bpdలో ఇది 21%గా (ఐదో వంతు వాటా) ఉంది. అక్టోబర్‌లో 902,740 bpd చమురును మన దేశానికి పంపింది. దీనర్ధం.. మన దేశానికి వస్తున్న ప్రతి 5 బ్యారెళ్ల ముడి చమురులో ఒక బ్యారెల్ రష్యా నుంచే వస్తోంది.
అంటే.. మన బైకులు, ఆటోలు, కార్లు, బస్సులు, లారీలు, ట్రక్కుల్లో వాడే పెట్రోల్ లేదా డీజిల్ దాదాపుగా రష్యాలోని సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చిందే.
నవంబర్‌లో, సముద్రం ద్వారా యూరోపియన్ యూనియన్ దిగుమతి చేసుకున్న రష్యన్ క్రూడ్‌తో పోలిస్తే భారతదేశానికి వచ్చిన రష్యా క్రూడ్ 38% ఎక్కువ. నవంబర్‌లో, రష్యా నుంచి రోజుకు మిలియన్ (10 లక్షలు) బ్యారెల్స్‌ను చైనా తెప్పించుకుంది.
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, ప్రైస్ క్యాప్ ప్రభావం
ఉక్రెయిన్ - రష్యా యుద్ధానికి ముందు, రష్యా నుంచి మన దేశానికి వచ్చిన ముడి చమురు వాటా నామామాత్రంగా ఉండేది. యుద్ధం ప్రారంభమయ్యాక, రష్యా మీద అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించాయి. తాజాగా, రష్యా క్రూడ్‌ను బ్యారెల్‌కు 60 డాలర్లకు మించి కొనకూడదని ప్రైస్ క్యాప్ కూడా విధించాయి. రష్యా కూడా అమెరికా, యూరప్ దేశాలకు ముడి చమురు సరఫరాను ఆపేసింది. వాటికి బదులుగా భారతదేశానికి క్రూడ్ ఎగుమతులు పెంచింది. అది కూడా చాలా తక్కువ ధరకు అందించడం మొదలు పెట్టింది. దీంతో ఆ దేశం నుంచి మన దేశానికి ముడి చమురు ఎగుమతులు క్రమంగా, గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు, గత రెండు నెలలుగా రష్యాది తొలి స్థానంగా మారింది.