UK Visa: జీ20 సదస్సు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. ఇది జరిగిన తర్వాత భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. యూకే రావాలనుకునే భారత యువ నిపుణులకు ఏటా 3 వేల వీసాలు అందిస్తామని బ్రిటన్ తెలిపింది.
ఇదీ పథకం
ఈ సరికొత్త వీసా పథకానికి యూకే ప్రధాని రిషి సునాక్ ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద భారత్‌కు చెందిన 18-30 ఏళ్ల డిగ్రీ విద్యావంతులకు ఏటా 3 వేల వీసాలు అందజేయనుంది బ్రిటన్ ప్రభుత్వం. ఈ వీసా ద్వారా యూకేకు వచ్చి రెండేళ్ల వరకు చదువుకోవడం, ఉద్యోగం చేసుకునేందుకు వీలుంటుంది.
ఆ ఒప్పందం
బోరిస్ జాన్సన్ హయాంలో భారత్-బ్రిటన్‌ల మధ్య ఎఫ్‌టీఏ ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే కొన్నాళ్లుగా బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం ఉండటంతో ఈ ఒప్పందం సహా ద్వైపాక్షిక సంబంధాలు కూడా కొంత నెమ్మదించాయి. ఈ ఒప్పందంపై జనవరిలో మొదలైన చర్చలు అక్టోబరు లోపు పూర్తవ్వాలి.
కానీ కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవటం, లిజ్‌ట్రస్ కేబినెట్‌లో హోం మంత్రిగా పనిచేసిన మరో భారత సంతతి మంత్రి బ్రేవర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలతో అది పట్టాలు తప్పింది. వీసాలు పూర్తయినా చాలామంది భారతీయులు యూకేను వీడిపోవటం లేదంటూ భారతీయ ఎంబసీని తప్పు పట్టేలా ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా స్పందించింది కూడా! ఆ ఒప్పందాన్ని ఇప్పుడు పట్టాలకెక్కించటం రిషి సునక్ ముందున్న సవాలు.
దీని ప్రకారం.. రెండు దేశాలు గరిష్ఠ వస్తువులపై కస్టమ్స్ సుంకాలను భారీగా తగ్గించడమో లేదా తొలగించడమో చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పెట్టబడులను ప్రోత్సహించేలా నిబంధనలను సులభతరం చేయాలి. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశకు చేరుకున్నాయి.
Also Read: Shraddha Walkar Murder Case: వెబ్ సిరీస్ చూసి ఆధారాలు మాయం చేసిన అఫ్తాబ్- మామూలోడు కాదు!