సినిమాలకు వెళ్తే తెరపై ముందుగా ముఖేష్ వస్తాడు...  పొగాకు నమలడం వల్ల ఏం జరిగిందో చెబుతాడు..! తర్వాత రాహుల్ ద్రావిడ్ వస్తాడు... జీవితంలో రనౌట్ కాకుండా ఉండాలంటే పొగ తాగవద్దు అంటాడు..! సిగరెట్ పెట్టే మీద  వైపు అంతా క్యాన్సర్‌కు గురైన నోటి పోటోను ప్రింట్ చేస్తారు. గుట్కా ప్యాకెట్లపైనా అంతే..!  అవి తింటే.. తాగితే అత్యంత ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని.. వాటి బారిన పడి ప్రతి ఏటా దేశంలో లక్షల మంది చనిపోతున్నారని లెక్కలు చెబుతూ ఉంటారు. మరి అలాంటి వాటిని ఎందుకు బ్యాన్ చేయరు..? ఈ సందేహం అందరికీ వచ్చి ఉంటుంది..? .  కానీ ఎందుకు బ్యాన్ చేయరో మాత్రం ఎవరూ చెప్పరు..! ప్రభుత్వం కూడా చెప్పదు. కానీ అసలు విషయం ఏమిటంటే... వాటి మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కారణంగానే వాటిని బ్యాన్ చేయరు. 


ఎందుకంటే.. అంత పెద్ద మొత్తంలో  ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుతుంది మరి. కేంద్ర అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్‌కు తెలిపిన లెక్కల ప్రకారం... కేంద్రానికి ఏటా..  రూ. 53, 750 కోట్లు సగటున ఆదాయం వస్తోంది.  ఇది కేవలం సిగరెట్ల మీద.. పొగాకు ఉత్పత్తుల విధిస్తున్న జీఎస్టీ, ఎక్సైజ్ పన్నుల ద్వారానే వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా పన్నులు విధిస్తూంటే అవి రాష్ట్రాల ఖాతాలోకి చేరుతాయి. కానీ కేంద్రానికి మాత్రం...  ఏడాదికి రూ. యాభై మూడు వేల కోట్లకుపైగానే ఆదాయం అందుతోందన్నమాట. ఇందులో కొంత మొత్తం అంటే.. ఓ వందో.. రెండు వందల కోట్లో...  ముఖేష్‌ కోసం.., రాహుల్ ద్రావిడ్ ప్రకటనల కోసం ఖర్చు చేసి ప్రజల్ని.. చైతన్య వంతుల్ని చేసే ప్రయత్నం చేస్తారు. మిగతా అంతా ప్రభుత్వం ... తమ ఖాతాలో వేసుకుని అదే ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఖర్చు చేస్తూ ఉంటుంది. 


ప్రజల పట్ల  తమకు అంత మాత్రం బాధ్యత ఉందని అనుకుంటూ ఉంటుంది ప్రభుత్వం . అందుకే ఎప్పటికప్పుడు...  అంటే బడ్జెట్ పెట్టిన ప్రతీ సారి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంచుతూనే ఉంటారు. ఎందుకంటే.. ఆ వ్యసనానికి అలవాటుపడిన వాళ్లు వదలలేరు..  ఎంత పెంచినా అడిగేవారు ఉండరు. అందుకే ఎంత వీలైతే అంత పెంచి.. ఆదాయం కళ్ల చూస్తూ ఉంటారు. కానీ..  సిగరెట్ .. పొగాకు ఉత్పత్తుల అలవాటు ఉన్న వారి జేబులు ఖాళీఅయిపోతూంటాయి. మరో వైపు వారి ఆరోగ్యం కూడా ఖాళీ అయిపోతూ ఉంటుంది.  ప్రభుత్వ ఖజానా మాత్రం నిండుతూనే ఉంటుంది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోనంత కాలం ఈ సీరియల్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది.