Revanth Reddy Meets PM Modi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధాని మోదీని కలిశారు. వారి ఢిల్లీ పర్యటనలో భాగంగా మోదీ నివాసానికి రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క చేరుకొని తెలంగాణ సమస్యల గురించి వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, సీఎం రేవంత్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ప్రధానితో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విభజన హామీలు, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటి అంశాలపై రేవంత్ కేంద్ర సహకారం కోరినట్లు తెలుస్తోంది. వీరి మధ్య భేటీ అరగంటపాటు సాగింది.


ప్రధానితో భేటీ తర్వాత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పార్టీ పనుల కోసం ఏఐసీసీ అగ్ర నేతల వద్దకు వెళ్లారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల గురించి చర్చించే అవకాశం ఉంది.