ABP C Voter Opinion Poll Andhra :  ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి అసలు బలం లేదు. మూడు ప్రాంతీయ పార్టీలు హవా చూపిస్తున్నాయి. అదే్ సమయంలో కాంగ్రెస్ పార్టీకి కొంత చరిత్ర ఉంది. అయితే ఏపీ ప్రజలు ఇప్పుడు ప్రధానిగా ఎవరు కావాలని అడిగితే.. మోదీనే కావాలని కోరుతున్నారు. 56 శాతం మంది ఏపీ ప్రజల చాయిస్ ప్రధాని మోదీనే. ఈ విషయం ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. 
 
ఏపీ ప్రజల్లో మోదీకే ఆదరణ 


ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధానిగా ఎవరు ఉండాలని కోరుకుంటారనే ప్రశ్న సహజంగానే ఆసక్తి రేపుతంది. ఎందుకంటే ఎపీలో ప్రాంతీయ పార్టీల హవా ఉంది. సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లు మాస్ లీడర్లుగా ఉన్నారు. ఏ ఎలాంటి పదవికైనా  ఆయా పార్టీల సానుభూతిపరులు వారినే  కోరుకుంటారు. అయితే వారు ప్రధాని పదవి రేసులో ఉండరు కాబట్టి..  ప్రధాని మోదీ, రాహుల్ చాయిస్ గా ఏపీ ప్రజల్లో ఉన్న ఆదరణ గురించి ఏబీపీ - సీఓటర్ ఒపీనియన్ పోల్ జరిపింది. ఇందులో దేశం మొత్తం ఎవరు ఉండాలని కోరుకుంటున్నారో  వారినే ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని తేలింది. 


56 శాతం మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మొగ్గు మోదీ వైపు 


 తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ మంది ప్రధాని మోదీ పరిపాలనపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. మూడో సారి కూడా ఆయనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు.   ఏపీ ప్రజల్లో 56 శాతం మంది ఆయన పాలనా తీరును సమర్థించి మళ్లీ ప్రధాని కావాలనుకుంటున్నారు.  దేశంలో అత్యంత కీలకమైన, ఖచ్చితమైన సర్వేలు అందిస్తుందని రికార్డు  సీఓటర్ సంస్థకు ఉంది.  దీ పేరును 56 శాతం మంది అంగీకరించారు. తెలంగాణలో  ఈ పర్సంటేజీ యాభై శాతం మాత్రమే ఉంది. అంటే.. . తెలంగాణ కంటే ఏపీలో మోదీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నట్లు అన్నమాట. 


రాహుల్‌ కు మద్దతు తక్కువే              


దక్షిణాదిలో మోదీకి మద్దతు లేదని కొంత మంది ప్రచారం చేస్తూ ఉంటారు.  అయితే ప్రధానిగా మోదీకే ఎక్కువ మంది మద్దతు తెలుపుతున్నారు. ఏపీలో 56, తెలంగాణలో 50 శాతం మంది మోదీకి మద్దతు తెలుపుతూంటే..  రాహుల్‌కు మాత్రం ఏపీలో 34 శాతం.. తెలంగాణలో  40 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా లోక్ సభ ఎన్నికలు.. కేంద్రంలో  ఎవరు  పరిపాలన చేయాలన్న దానిపై మోదీకే ఎక్కువగా మద్దతు తెలుపుతున్నారు. 


ఏపీలో మోదీకి ఉన్న మద్దతు  బీజేపీకి ఎందుకు లభించడం లేదు ?                


ఏపీలో  మోదీకి అంత భారీగా మద్దతు ఉంటే బీజేపీ ఎందుకు ఏపీలో ఎదగలేకపోతోందని కొంత మందికి డౌట్ వస్తుంది.  మోదీని వ్యతిరేకించే పార్టీ ఏపీలో లేదు.  మూడు ప్రాంతీయ పార్టీలు మోదీ పాలనను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాయి.  టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు   మోదీకి సపోర్టు చేస్తూ...  వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే ఏపీలోని పాతిక లోక్ సభ సీట్లలో ఎవరు గెలిచినా ఎన్డీఏ ఖాతాలోనే ఉంటాయని సెటైర్లు పడుతూ ఉంటాయి. అయితే ప్రాంతీయ పార్టీల వ్యూహమే  బీజేపీని ఎదగకుండా చేస్తున్యని అనుకోవచ్చు.