Republic Day 2023: జనవరి 26వ తేదీని పురస్కరించుకొని యావత్ భారత్ దేశం ఈరోజు 74వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధిల్లీలోని కర్తవ్యపథ్‌ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగాగనే భారత త్రివిధ దళాలు సుప్రీం కమాండర్ కు వందనం చేశాయి. త్రివర్ణ పతాకం అంటే కేవలం జెండా మాత్రమే కాదు.. ప్రతీ భారతీయుడి గుండెల్లో రెపరెపలాడే ఓ భావోద్వేగం. జాతీయ జెండా అనేది దేశానికి గుర్తింపును ఇస్తుంది. ప్రపంచంలోని ప్రతీ దేశానికి దాని సొంత జెండా ఉంటుంది. ఇది ఆ దేశ స్వాతంత్ర్యానికి ప్రతీక. భారతదేశం గురించి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం పొందటానికి కొద్ది రోజుల ముందే త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆవిష్కరించారు. 1947వ సంవత్సరం జులై 22వ తేదీ రోజున భారత రాజ్యాంగ సభ సమావేశంలో త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించారు. 


త్రివర్ణ జాతీయ జెండా


1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రాగా... దానితోపాటు త్రివర్ణ పతాకం కూడా భారతదేశ జాతీయ జెండాగా మారింది. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడికి గర్వకారణం. భారత జాతీయ జెండా మూడు రంగులను కల్గి ఉంది. దీని పైభాగంలో కాషాయం రంగు, మధ్యతో తెలుపు, దిగువన ఆకు పచ్చ రంగు ఉంటుంది. అయితే తెలుపు రంగు మధ్యలో నీలిరంగుతో అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రంలో మొత్తం 24 స్పోక్స్ ఉంటాయి. అలాగే 3:2 నిష్పత్తిలో జెండా ఉండగా... దీన్ని ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పింగళి వెంకయ్య నిర్మించారు.


జాతీయ జెండా అభివృద్ధి ఎలా జరిగిందంటే..?



  1. స్వదేశీ ఉద్యమం సమయంలో భారత జాతీయ జెండా మొదట రూపొందించారు. కలకత్తా (కోల్‌కతా)లోని పార్సీ బగాన్ చౌక్ (గ్రీన్ పార్క్)లో ఆగస్టు 7వ తేదీ 1906న మొదటి జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ పతాకంలో సమాన వెడల్పుతో అడ్డంగా మూడు పట్టీలు ఉన్నాయి. పైన నారింజ రంగు, మధ్యలో పసుపుపచ్చ, కింద ఆకుపచ్చ. పైపట్టీ మీద సగం విచ్చుకున్న ఎనిమిది తామర పూలు, కింది పట్టీ మీద నెలవంక, మధ్యలో దేవనాగరి లిపిలో "వందేమాతరం" అనే అక్షరాలున్నాయి. 

  2. మేడమ్ భిఖాజీ కామా 1907లో పారిస్‌లో కొంతమంది భారతీయ విప్లవకారుల సమక్షంలో ఎగురవేసిన జెండాను రెండో జాతీయ జెండాగా పరిగణిస్తారు. ఇది కూడా మొదటి జెండాను పోలి ఉంటుంది. వీటిలో ఆకుపచ్చ రంగు ఇస్లాంకు, కాషాయం రంగు హిందూ, బౌద్ధాలకు సూచికలు. ఆకుపచ్చ పట్టీలో బ్రిటిషు భారతంలోని 8 ప్రావిన్సులకు గుర్తుగా 8 పద్మాలు ఉన్నాయి. మధ్యనున్న కాషాయ పట్టీలో దేవనాగరి లిపిలో వందేమాతరం రాసి ఉంది. అడుగున ఉన్న పట్టీలో  ఓ చివర నెలవంక, రెండో చివర సూర్యుడు గుర్తును ఉంచారు. ఈ జండాను భిఖాజీ కామా, వీర సావర్కార్, శ్యాంజీ కృష్ణ వర్మ కలిసి తయారు చేసారు. 

  3. మూడో జాతీయ జెండా 1917 సంవత్సరం హోమ్ రూల్ ఉద్యమం సమయంలో రూపొందించారు. ఈ ఉద్యమంలో ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చని అడ్డపట్టీలు గల ఇంకొక జెండాను వాడారు. జెండా పైభాగంలో ఎడమవైపు తాము కోరిన డొమినియన్ హోదాకు సూచికగా యూనియన్ జాక్ గుర్తు, కుడివైపు తార-నెలవంక గుర్తులను వాడారు. దానికి దిగువన హిందువులకు పవిత్రమైన సప్తర్షి మండలానికి గుర్తుగా ఏడు నక్షత్రాలున్నాయి. యూనియన్ జాక్ ఉండడం వల్లనేమో ఇది జనామోదం పొందలేకపోయింది.

  4. 1921లో విజయవాడలో జరిగిన భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో పద్నాలుగో జాతీయ జెండాగా పిలిచే జెండాను ఉపయోగించారు. గాంధీజీ చరఖా చిహ్నం మూడు రంగుల చారలలో చిత్రీకరించారు. ఈ జెండా మూడు రంగులను కలిగి ఉంది. తెలుపు రంగు కాకుండా, ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. వీటిలో ఆకుపచ్చ ఇస్లాంను, ఎరుపు హిందూ మతాన్ని సూచిస్తుంది. 

  5. 1931 సంవత్సరంలో ఆమోదించిన జాతీయ జెండా మన ప్రస్తుత జాతీయ జెండా రూపానికి చాలా దగ్గరగా ఉంది. ఈ జెండా మూడు రంగులను కలిగి ఉంది. కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉండగా... తెలుపు రంగు మధ్యలో గాంధీజీ రాట్నం చిహ్నాన్ని ఉంచారు.

  6. జాతీయ జెండా ప్రస్తుత రూపాన్ని 22 జూలై 1947న రాజ్యాంగ సభ ఫ్లాగ్ కమిటీ ఆమోదించింది. ఈ కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్.