Renu Desai strongly opposes killing of dogs: మద్యం తాగి, వాహనాలు నడిపడం వల్ల ఎంతో మంది చనిపోతున్నారని ప్రభుత్వాలు మద్యం దుకాణాలను ఎందుకు మూసివేయడం లేదని నటి, సామాజిక కార్యకర్త రేణుదేశాయ్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు .. ఎన్జీవోల విషయంలో చేసిన వ్యాఖ్యలపై పునరాలోచించాలని కోరారు. కుక్కల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరుకూ పలు ప్రశ్నలు సంధించారు. ప్రెస్మీట్‌లో రేణుదేశాయ్‌తో పాటు యాంకర్ రష్మిగౌతమ్ కూడా పాల్గొన్నారు.
కుక్కలన్నీ ప్రమాదకరం కాదు: రేణు దేశాయ్
వీధి కుక్కల సమస్యపై స్పందిస్తూ రేణు దేశాయ్ భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా ఒక కుక్క తప్పు చేస్తే లేదా ఒక అపశ్రుతి చోటుచేసుకుంటే, ఆ ప్రాంతంలోని వందలాది కుక్కలను చంపడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి కుక్క ప్రమాదకరమైనది కాదు. ఒక కుక్క చేసిన తప్పుకు జాతి మొత్తాన్ని శిక్షించడం ఎంతవరకు న్యాయం అని ఆమె ప్రశ్నించారు. మూగజీవాల పట్ల ద్వేషాన్ని పెంచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాధ్యత తీసుకోవడానికి సిద్ధం
చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేస్తున్న సంఘటనలు తనను కూడా కలిచివేస్తున్నాయని చెబుతూనే, వాటిని చంపడానికి బదులు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని ఆమె సూచించారు. ఎక్కడైనా కుక్కలు పిల్లలకు హాని చేస్తున్నాయని భావిస్తే, ఆ ప్రాంతాల వివరాలను తమకు తెలియజేయాలని కోరారు. అలాంటి కుక్కల బాధ్యత తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా లాంటి యానిమల్ లవర్స్‌కు వాటిని అప్పగించండి, మేము వాటిని సంరక్షిస్తాము అని రేణు దేశాయ్ ప్రకటించారు.
మద్యం దుకాణాల ఉదాహరణతో ప్రశ్నలు
ఈ సందర్భంగా ఆమె సమాజంలోని ఇతర సమస్యలతో కుక్కల అంశాన్ని పోల్చారు. ప్రతిరోజూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, మరి ఆ కారణంతో ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేస్తోందా? అని నిలదీశారు. మనుషులు చేసే తప్పులకు లేని కఠిన నియమాలు, కేవలం మూగజీవాల విషయంలోనే ఎందుకు అమలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పరిష్కారం చంపడం కాదు!
వీధి కుక్కల సమస్యకు పరిష్కారం వాటిని చంపడం కాదని, సరైన పద్ధతిలో జంతు నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. కుక్కలకు ఆహారం అందకపోవడం, వాటి ఆవాసాలను దెబ్బతీయడం వల్లనే అవి అసహనానికి గురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు, ప్రభుత్వం కలిసికట్టుగా శాస్త్రీయమైన పద్ధతుల్లో ఈ సమస్యను పరిష్కరించాలే తప్ప, హింసను ప్రోత్సహించకూడదని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.