NEET UG 2026 Exam | వైద్య రంగంలో కెరీర్ ప్రారంభించాలని ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు NEET UG 2026 ఒక ముఖ్యమైన పరీక్ష. ఈ ఎగ్జామ్ ద్వారా MBBS, BDS, ఆయుర్వేదం, హోమియోపతి, నర్సింగ్ వంటి పలు వైద్య కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. NEET పరీక్షను ప్రతి సంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుందని తెలిసిందే. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నీట్ యూజీ ఎగ్జామ్ రాస్తుంటారు.
నీట్ యూజీ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది
NEET UG 2026 పరీక్ష మే 2026 మొదటి ఆదివారం నాడు నిర్వహించే అవకాశం ఉంది. అయితే, దీని అధికారిక తేదీని NTA కొన్ని రోజుల తరువాత ప్రకటిస్తుంది. ఈ పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో, అంటే పెన్-పేపర్ ఆధారిత ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. నీట్ యూజీ పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
నీట్ యూజీ పరీక్ష విధానం
NEET UG 2026లో మొత్తం 180 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ నుండి 45- 45 ప్రశ్నలు, అలాగే బయాలజీ నుంచి 90 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మొత్తం 720 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి. అయితే ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోల్పోతారు.
NEET UG 2026 కోసం అర్హత
NEET UG 2026 రాయాలనున్న అభ్యర్థి 12వ తరగతిని భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ కేటగిరీ విద్యార్థులకు కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరిగా రావాలి. అయితే SC, ST, OBC కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. దీనితో పాటు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి వయస్సు 17 ఏళ్లు నిండి ఉండాలి, అయితే గరిష్ట వయోపరిమితి నిర్ణయించలేదు.
దరఖాస్తు ఫీజు
నీట్ యూజీ 2026 అప్లికేషన్ ఫారమ్ నింపిన తర్వాత అభ్యర్థి ఆన్‌లైన్ ద్వారా రుసుమును చెల్లించాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1700, OBCతో పాటు EWS అభ్యర్థులకు రూ. 1600, SC, ST కేటగిరీలకు రూ. 1000గా నిర్ణయించారు.
అప్లికేషన్ ఫారమ్ సమర్పించే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
చివరగా సబ్మిట్ చేయడానికి ముందు, దరఖాస్తు ఫారమ్‌లో నింపిన మొత్తం వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే మీ అప్లికేషన్ ఫారం రద్దు చేయవచ్చు. ఫారమ్ సమర్పించిన తర్వాత, నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకోవాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
- ముందుగా NEET అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in కి వెళ్లాలి
- హోమ్‌పేజీలో నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ (NEET UG 2026 Registration) లింక్‌పై క్లిక్ చేయండి.
- పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ID వంటి అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి. పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోండి.
- మొబైల్, ఈమెయిల్‌కు వచ్చిన OTPని నమోదు చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
- ఇప్పుడు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
- వ్యక్తిగత వివరాలు, ఎడ్యుకేషన్ సమాచారం, పరీక్ష రాయాలనుకున్న ల్యాంగ్వేజ్, పరీక్ష సిటీని పూరించండి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించండి.
- అప్లికేషన్ ఫారమ్ సమర్పించే ముందు అన్ని వివరాలను మళ్లీ చెక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోవాలి