Reliance Annual Report: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేష్‌ అంబానీ. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL). ఇది హిట్‌ కాంబినేషన్‌ కాబట్టి, RILలో ఏం జరిగినా అది ఇండస్ట్రీ రికార్డ్‌ అవుతుంది.


సాధారణంగా, సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీలో జాబ్ జంప్స్‌ ఎక్కువగా కనిపిస్తుంటాయి/వినిపిస్తుంటాయి. కొత్త అవకాశాలను వెతుక్కుంటూ, ఒక కంపెనీ నుంచి మరో కంపెనీలోకి టెక్కీలు దూకుతుంటారు. ఐటీ కంపెనీల ఆర్థిక లెక్కల్లో ఆట్రిషన్‌ రేట్‌ (ఉద్యోగ వలసల శాతం) చాలా కీలకం. ఆట్రిషన్‌ రేట్‌ దాదాపు 20%గా ఉంటేనే, సిట్యుయేషన్‌ చాలా వరస్ట్‌గా ఉందని చెప్పుకుంటారు. రిలయన్స్‌ విషయానికి వస్తే, ఆట్రిషన్‌ రేట్‌లో అది ఐటీ కంపెనీలకు ముత్తాత లాంటిది. 


రిటైల్‌ నుంచి 1.19 లక్షల మంది, జియో నుంచి 41 వేల మంది
2022-23లో, రిలయన్స్‌ రిటైల్ & టెలికాం సెగ్మెంట్స్‌ నుంచి తప్పుకున్న ఉద్యోగుల సంఖ్య మామూలుగా లేదు. ఆ ఫైనాన్షియల్‌ ఇయర్‌లో, రిలయన్స్‌ జియో నుంచి 41,000 మందికి పైగా ఉద్యోగులు జాబ్‌కు రిజైన్‌ చేశారు. రిలయన్స్ రిటైల్‌కు ఏకంగా లక్ష మందికి పైగా సిబ్బంది గుడ్‌బై చెప్పారు. రిలయన్స్‌ యాన్యువల్‌ రిపోర్ట్స్‌లో ఈ డేటా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో (FY22) పోలిస్తే, అట్రిషన్ రేట్‌ (వలసల రేటు) 64.8 శాతం పెరిగింది.


ఇటీవలి సంవత్సరాల్లో రిటైల్ సెగ్మెంట్‌ కోసం చాలా కంపెనీలను RIL కొనుగోలు చేసింది. ఆ కంపెనీల్లోని ఉద్యోగులంతా రిలయన్స్‌ రిటైల్‌ గొడుగు కిందకు వచ్చారు. దీంతో, రోల్‌ డూప్లికేషన్ పెరిగింది. అంటే, ఒకే పని చేసేవాళ్లు ఎక్కువయ్యారు. అలాంటి వాళ్లు కంపెనీ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. వేరే ఇండస్ట్రీలు, కంపెనీల్లో ఈ మధ్య హైరింగ్స్‌ పెరగడంతో, కొత్త అవకాశాలను వెతుక్కుంటూ మరికొందరు వెళ్లిపోయారు. 


మొత్తంగా... FY23లో 1,67,391 మంది ఉద్యోగులు RILకి దండం పెట్టి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లిపోయారు. వాళ్లలో.. రిటైల్ సెగ్మెంట్‌ నుంచి 1,19,229 మంది & జియో నుంచి 41,818 మంది ఉన్నారు. ఈ నిష్క్రమణలు ఆఫీస్‌ బాయ్స్‌ నుంచి మేనేజర్‌ లెవల్‌ వరకు ప్రతి స్థాయిలోనూ కనిపించాయి. అయితే, జూనియర్ నుంచి మిడ్-మేనేజ్‌మెంట్ స్థాయుల్లోనే ఎక్కువగా ఉన్నాయి.


వెళ్లిపోయిన వాళ్ల కంటే ఎక్కువ మందికి RIL జాబ్స్‌
రిలయన్స్‌ కూడా ఎక్కడా తగ్గలేదు. వెళ్లిపోయిన వాళ్ల ప్లేస్‌లను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ వచ్చింది. FY23లో, మొత్తం 2,62,558 మంది ఉద్యోగులను నియమించుకుంది, ఇంకా తీసుకునే పనిలో ఉంది. 


RIL నుంచి వెళ్లిపోయిన వాళ్ల వల్ల కంపెనీకి మంచే జరిగిందన్న వాదనలు కూడా మార్కెట్‌లో వినిపిస్తున్నాయి. కంపెనీకి ఖర్చులు తగ్గాయి, తగిన సామర్థ్యం లేని వాళ్లు వెళ్లిపోయారని చెప్పుకుంటున్నారు.


రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశం (AGM) ఈ నెల 28న మధ్యాహ్నం 2:00 గంటలకు జరుగుతుంది. ఈ ఈవెంట్‌ సందర్భంగా, రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, రాబోయే జియోఫోన్ 5G, కస్టమర్-ఫోకస్డ్ జియో 5G ప్లాన్స్‌, మరికొన్ని ముఖ్యమైన అప్‌డేడ్స్‌ ఇస్తారని మార్కెట్‌ భావిస్తోంది.


మరో ఆసక్తికర కథనం: ₹60 వేల దిగువన గోల్డ్‌ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial