Rat Bite in Cinema Hall:


మహిళను కొరికిన ఎలుక..


సరదాగా థియేటర్‌కి వెళ్లింది. సినిమా బాగుందని ఎంజాయ్ చేస్తోంది. ఉన్నట్టుండి కాలికి ఏదో తగిలినట్టు అనిపించింది. ఆ తరవాత కొరికినట్టు అనిపించింది. వెంటనే చూసుకుంటే కాలికి రక్తం కారుతోంది. చుట్టూ చూస్తే ఎలుక పరిగెత్తుతూ కనిపించింది. అంతే. వెంటనే థియేటర్ యాజమాన్యంపై కోపంతో ఊగిపోయింది ఆ మహిళ. థియేటర్‌ని ఇలాగేనా మెయింటేన్ చేసేది అంటూ ప్రశ్నించింది. అయినా వాళ్లు పెద్దగా స్పందించలేదు. ఇది ఇంకాస్త అసహనానికి గురి చేసింది. లీగల్‌గానే చూసుకుంటానని వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చింది. వంటనే కన్జ్యూమర్ ఫోరమ్‌లో కంప్లెయింట్ చేసింది. దాదాపు 5 నెలల పాటు తిరిగితే కానీ..వాళ్లు ఆ ఫిర్యాదుని తీసుకోలేదు. ఇదంతా జరిగి నాలుగేళ్లు దాటింది. 2018లో అక్టోబర్ 28న గువాహటిలోని గలేరియా మాల్‌లో జరిగిందీ ఘటన. ఇన్నేళ్లకు కోర్టు తీర్పునిచ్చింది. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, వెంటనే పరిహారం చెల్లించాలని ఆదేశించింది. రూ.67,000 ఫైన్ కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. థియేటర్‌ని క్లీన్‌గా ఉంచడం యాజమాన్యం కనీస బాధ్యత అని వెల్లడించింది కన్జ్యూమర్ కోర్టు. 


"థియేటర్‌ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం యాజమాన్యం కనీస బాధ్యత. కంప్లెయింట్‌లో చెప్పిన ప్రకారం చూస్తే సినిమా హాల్ ఏ మాత్రం నీట్‌గా లేదు. ఎక్కడపడితే అక్కడ పాప్‌కార్న్ పారేసి ఉంది. మిగతా ఫుడ్ కూడా కింద పడిపోయింది. వాటిని క్లీన్ చేయలేదు. వాటిని తినేందుకు ఎలుకలు వచ్చాయి. అలా వచ్చి ఓ మహిళ కాలుని కొరికాయి. ఆ బాధితురాలు చాలా రోజుల పాటు ఆ గాయంతో బాధ పడ్డారు. ఇది కచ్చితంగా నిర్లక్ష్యమే. 45 రోజుల్లోగా ఆ మహిళకు పరిహారం చెల్లించాలి. రూ.67,000 కట్టాలి. ఒకవేళ 45 రోజుల్లోగా చెల్లించకపోతే వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేస్తాం. 12% వడ్డీ రేటు చొప్పున కలెక్ట్ చేయాల్సి ఉంటుంది"


- కన్‌జ్యూమర్ కోర్ట్ 


అయితే...దీనిపై థియేటర్ యాజమాన్యం తమ వాదనలు వినిపిస్తోంది. ఆ మహిళకు గాయమైన వెంటనే చికిత్స అందించామని, వాటికి ఖర్చు కూడా భరించామని వివరిస్తోంది. కానీ బాధితురాలు మాత్రం ఈ వాదనను కొట్టి పారేసింది. 


"నాకు గాయమైన వెంటనే నేను ఓనర్‌తో మాట్లాడాను. రూ.6 లక్షల పరిహారం కోసం కోర్టులో ఫిర్యాదు చేశాను. దీనిపై ఆ ఓనర్ నాతో గొడవకకు దిగాడు. ఇలా ఫిర్యాదు చేయడం సరికాదంటూ వాదించాడు. నాకు ఎలాంటి చికిత్స చేయించలేదు. పైగా తరువాతి సినిమాకు ఫ్రీగా టికెట్స్ ఇస్తానని సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేశాడు"


- బాధితురాలు 


ఏప్రిల్ 25వ తేదీనే కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే థియేటర్ యాజమాన్యంపై మండి పడింది. సినిమా హాల్‌ని తరచూ క్లీన్ చేసుకోవాలని ఆదేశించింది. అంతే కాదు. శానిటైజేషన్‌ విషయంలోనూ ఏ మాత్రం జాగ్రత్తలు పాటించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫిర్యాదులు మళ్లీ మళ్లీ వస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. 


Also Read: Wrestlers Protest: బేటీ బచావో అంతా ఓ బూటకం - మహిళా రెజ్లర్ల ఆందోళనలకు రాహుల్ సపోర్ట్