Rashtrapatni Remark Row: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలపై బహుజన్ సమాజ్ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు. ఇది అత్యంత సిగ్గుచేటు అని మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అధిర్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలి. ఓ గిరిజన తెగ నుంచి భారతదేశ అత్యున్నత పదవికి ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం చాలా మందికి నచ్చలేదు. ముర్ముపై అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు చాలా విచారకరం. - మాయావతి, బీఎస్‌పీ అధినేత్రి
ఇదీ జరిగింది
కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి 'రాష్ట్రపత్ని' అనటం తీవ్ర వివాదస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలంటూ ఉభయసభలు ప్రారంభం కాగానే భాజపా ఎంపీలు ఆందోళనకు దిగారు.
లోక్ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
" గిరిజన, దళిత, మహిళా వ్యతిరేకంగా కాంగ్రెస్ పని చేస్తోంది. ప్రధాని మోదీ.. గిరిజనులకు అత్యుత్నత స్థాయి గౌరవం ఇస్తే.. మీరు ఇంతలా అవమానిస్తారా? "
-స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి
అటు రాజ్యసభలోనూ రాష్ట్రపతి అంశంపై ఆందోళన రేగింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవి తీవ్రంగా ఖండించదగిన వ్యాఖ్యలన్నారు.