Rammohan Naidu : అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయిన ఘటనపై అమెరికా మీడియా 'పైలట్ తప్పిదం' అనే అంశాన్ని హైలెట్ చేస్తూ ప్రచారం చేస్తోంది. ఈ వాదనను కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తిరస్కరించారు. పైలట్ తప్పిదానికి సంబంధించి విదేశీ మీడియాల్లో జరుగుతున్న ప్రచారంపై పార్లమెంట్ లో మంత్రి స్పందించారు.పాశ్చాత్య మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తలు వారి స్వార్థపూరిత ఆలోచనల కోసమే అయి ఉండవచ్చన్నారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సీనియర్ పైలట్‌పై నింద మోపడానికి ప్రయత్నించిన పాశ్చాత్య మీడియా కథనాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ఆదివారం మరోసారి ఖండించారు. విమాన ప్రమాదాలను దర్యాప్తు చేయడానికి బాధ్యత వహించే కేంద్ర సంస్థ అయిన ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (AAIB)పై తాను నమ్మకం ఉంచానని ఆయన అన్నారు.
"నేను AAIBని నమ్ముతాను. AAIB చేస్తున్న పనిని నేను నమ్ముతాను. వారు భారతదేశంలో ఇక్కడ డేటాను డీకోడ్ చేయడంలో అద్భుతమైన పని తీరు చూపించారు. ఇది భారీ విజయం," అని రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రాథమిక నివేదిక ఇచ్చిన ఏజెన్సీని ప్రశంసించారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ,రాయిటర్స్ వంటి సంస్థలు పైలట్ల తప్పిదమేనని వార్తలు ప్రుచరించాయి. స్వార్థపూరితంగా నివేదికను తప్పుదోవ పట్టించేలా ఇలాంటి కథనాలు ప్రచురించవద్దని ఏఐబీబీ ఇప్పటికే పాశ్చాత్య మీడియాకు విజ్ఞప్తి చేసిందన్నారు. తుది నివేదిక రాక ముందు ఆధారం లేని సిద్ధాంతాలను ప్రచారం చేయవద్దని రామ్మోహన్ నాయుడుహెచ్చరించారు. తుది నివేదిక రాకముందే ఏవైనా వ్యాఖ్యలు చేయడం ఎవరి తరపున అయినా మంచి పద్దతి కాదన్నారు. తుది నివేదికకు ముందు ఏదైనా నిర్ణయానికి రావడం సరి కాదని.. జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. విమాన ప్రమాదాలను దర్యాప్తు చేయడంలో భారతదేశం గత సంవత్సరాల్లో సాధించిన పురోగతిని కూడా రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు.
గతంలో డేటాను బయటకు తీసుకురావడానికి బ్లాక్ బాక్స్‌ను ఎల్లప్పుడూ విదేశాలకు పంపేవారు. భారతదేశంలో డేటాను డీకోడ్ చేయడం ఇదే మొదటి సారి అని గుర్తు చేశారు. AAIB తన ప్రాథమిక దర్యాప్తు నివేదికలో కాక్‌పిట్ రికార్డింగ్‌ను వెల్లడించింది, అందులో ఒక పైలట్ "మీరు ఇంధనాన్ని ఎందుకు ఆపివేసారు?" అని అడుగుతున్నట్లు వినిపించింది. మరొక పైలట్ "నేను అలా చేయలేదు" అని బదులిచ్చారు. ఇంధన సరఫరా ఉద్దేశపూర్వకంగా ఆపివేయబడిందా లేదా అనే దానిపై వ్యాఖ్యానించకుండా AAIB నివేదిక అక్కడితో ఆగింది. అయితే మాజీ US అధికారి పేరుతో వాల్ స్ట్రీట్ జర్నల్, ఇది సీనియర్ పైలట్ ఉద్దేశపూర్వకంగా చేసిన పని అని కథనాలు ప్రసారం చేయడంతో సమస్య ప్రారంభమయింది. దీన్ని రామ్మోహన్ నాయుడు నిర్మోహమాటంగా ఖండించారు.