Andhra Pradesh to be a Green Hydrogen Valley | అమరావతి: 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu). గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో దేశానికే ఆదర్శంగా నిలవాలని ’గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ- అమరావతి డిక్లరేషన్’ను సోమవారం నాడు విడుదల చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు సమక్షంలో చంద్రబాబు గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ విడుదల చేశారు. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్‌పై రెండు రోజుల పాటు సమ్మిట్ నిర్వహించారు.
సమ్మిట్‌లో చర్చించిన అంశాలతో అమరావతి డిక్లరేషన్
అమరావతిలో జరిగిన సమ్మిట్‌లో 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు. 7 సెషన్స్‌గా జరిగిన సమ్మిట్‌లో పాల్గొన్న గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల సీఈఓలు, సీఓఓలు, ఎండిలు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్‌లో చర్చించిన అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ప్రకటించింది. భారత్‌లో స్వచ్ఛమైన ఇంధనాల ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు విధివిధానాలు రూపొందించేలా డిక్లరేషన్ ప్రకటించారు. ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలాని లక్ష్యంగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది.
గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా ఏపీ- గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టంను ఏపీలో నెలకొల్పటమే డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశ్యం. 2027 నాటికి 2 గిగావాట్లు, 2029కి 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ల తయారీ లక్ష్యంగా పెట్టుకుంది. 2029 నాటికి ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయనున్నారు. కిలో హైడ్రోజన్ గ్యాస్ రూ.460 నుంచి రూ.160కి తగ్గించేలా పరిశోధనలు, కార్యాచరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. 2029 నాటికి 25 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ పంపిణీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని డిక్లరేషన్ లో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా దీన్ని తీర్చిదిద్దాలని డిక్లరేషన్‌లో నిర్ణయం తీసుకున్నారు. సరికొత్త గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణలు, పరిశోధనల కోసం రూ.500 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ దిశగా కృషి చేసే 50 స్టార్టప్‌లకు ప్రోత్సాహం కల్పించాలని తాజా డిక్లరేషన్‌లో ప్రకటించారు.