Election Results 2024: బీజేపీ యూపీ ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా రామ మందిరం ఉన్న ఫైజాబాద్‌లోనే బీజేపీ అభ్యర్థి ఓడిపోవడం ఆ పార్టీనే కాదు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకిలా జరిగిందని ఇప్పటికే హైకమాండ్‌ రివ్యూ చేసుకుంటోంది. కానీ బీజేపీ యూపీలో ప్రభంజనం సృష్టిస్తుందని బలంగా నమ్మని వాళ్లంతా వరుస పెట్టి పోస్ట్‌లు పెడుతున్నారు. హిందువులే హిందువులను వెన్నుపోటు పొడిచారంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హిందీ రామాయణ్ సీరియల్‌లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లహిరి (Sunil Lahiri) స్పందించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తనకు నిరాశ కలిగించాలని అసహనం వ్యక్తం చేశారు. ఓటింగ్‌ చాలా తక్కువగా నమోదవడంపైనా ఆవేదన చెందారు. సంకీర్ణ ప్రభుత్వం వస్తే ఐదేళ్ల పాటు వాళ్లు అది ఉంటుందా అన్న అనుమానం వ్యక్తం చేశారు. అయోధ్య ప్రజల్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సీతను అనుమానించి అవమానించారని, నిజమైన రాజుకి వెన్నుపోటు పొడవడం అయోధ్య ప్రజలకు అలవాటే అంటూ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. 


"లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నాకెంతో నిరాశ కలిగించాయి. ఓటింగ్‌ శాతం చాలా తక్కువగా నమోదైంది. దయచేసి ఓటు వేయాలని నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను. కానీ ఎవరూ నా మాట పట్టించుకోలేదు. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే ఐదేళ్ల పాటు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. అప్పట్లో సీతమ్మ వారి శీలాన్ని అయోధ్య ప్రజలు శంకించారు. నిజమైన రాజుకి వెన్నుపోటు పొడవడం ఇక్కడి వాళ్లకు అలవాటే. అయోధ్య ప్రజలకు నా సెల్యూట్. మీరు సీతమ్మవారినే అవమానించారు. ఇక టెంట్‌లో ఉన్న రాముడికి గుడి కట్టిన వాళ్లకి ద్రోహం చేయడంలో వింతేముంది. ఇకపై ఎవరూ మిమ్మల్ని ఉపేక్షించరు"


- సునీల్ లహిరి, నటుడు 






తనకు ఎంతో ఇష్టమైన నటులు కంగనా రనౌత్, అరుణ్ గోవిల్ ఈ ఎన్నికల్లో గెలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇద్దరికీ అభినందనలు తెలిపారు. అరుణ్ గోవిల్‌ రామాయణ్ సీరియల్‌లో రాముడిగా నటించారు. లక్ష్మణుడిగా సునీల్ లహిరి కనిపించారు. ఫైజాబాద్‌లో బీజేపీ తరపున విశ్వదీప్ సింగ్‌ బరిలోకి దిగారు. ఆయనపై ఎస్‌పీ అభ్యర్థి అక్షయ యాదవ్ 89 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.