NEET UG 2024 Results: జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) జూన్ 4న నీట్ యూజీ ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల ద్వారా 2024–25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య యూజీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 23.33 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. వారిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణలై అర్హత సాధించారు. అలాగే మొత్తం 67 మందికి సమాన పర్సంటైల్ (99.997129) వచ్చింది. వారందరికీ ఒకటో ర్యాంకు కేటాయించారు. వారిలో నలుగురు ఏపీ విద్యార్థులున్నారు.
పెరిగిన విద్యార్థుల సంఖ్య
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్య 1.70 లక్షలు పెరిగింది. ఏపీ నుంచి 64,931 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 43,858 మంది అర్హత సాధించారు. దీంతో రాష్ట్ర వాప్తంగా విద్యార్థులు తమ ర్యాంకు ఎంత? సీటు ఎక్కడ వస్తుందనే అంచనాలు వేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో వచ్చే ర్యాంక్ ఎంత? గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కళాశాలలో సీటు వచ్చిందో పోల్చుకొని లెక్కలు వేసుకుంటున్నారు. ఈసారి ఏ కళాశాలలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకుంటున్నారు.
కౌన్సెలింగ్‌కు సన్నద్ధం
తమకు వచ్చే ర్యాంక్ ఆధారంగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు సిద్ధమవుతున్నారు. కళాశాలల ప్రాధాన్యత క్రమం ఏ విధంగా ఉండాలో కసరత్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 30 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇందులో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉన్నాయి. అన్ని కాలేజీల్లో కలుపుకుని 5,360 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. అలాగే బీ కేటగిరిలో 85 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు.
ఆ కాలేజీలో సీటు వస్తే అదృష్టమే
రాష్ట్రంలో మొత్తం 30 వైద్య కాలేజీలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది వైజాగ్‌లోని ఆంధ్ర వైద్య కళాశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వైద్య విద్యను అభ్యసించాలని ఆశపడే విద్యార్థులు ఈ కాలేజీలో చేరేందుకు ఆసక్తి చూపుతారు. ఇక్కడ సీటు లభిస్తే అది అదృష్టంగా భావిస్తారు. ఇక్కడ బోధనతో పాటు సౌకర్యాలు, వసతులు ఇతర సదుపాయాలు బాగుంటాయనే కారణంగా ఎక్కువ శాతం విద్యార్థులు ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సీట్ల కేటాయింపు పరిశీలిస్తే..
ఆంధ్ర వైద్య కళాశాలలో గత ఏడాది వచ్చిన సీట్ల కేటాయింపు పరిశీస్తే.. ఓసీ కేటగిరీలో 621తో 17976 ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌లో 608తో 24384 ర్యాంకు వరకు విద్యార్థులకు సీట్లు దక్కాయి. అలాగే బీసీ–ఏలో 596తో 31456 ర్యాంకు, బీసీ–బీ 612తో 22315 ర్యాంకు, బీసీ–సీలో 591తో 34134 ర్యాంకు, బీసీ–ఈలో 548తో 24384 ర్యాంకు వరకు సీటు లభించింది. ఎస్సీ విభాగంలో 545తో 67614 ర్యాంక్ విద్యార్థికి సీటు దక్కింది. ఎస్టీ విభాగంలో 490 స్కోర్‌తో 118377 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది.