Ram Mandir Opening: రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య సిద్ధమైంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అయోధ్యకు తరలి వచ్చారు. ఈ క్రమంలోనే ప్రధాని మంత్రి కార్యాలయం ఓ ఆసక్తికర వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రధాని మోదీ చాపర్ నుంచి అయోధ్య ఏరియల్ వ్యూ వీడియో (Ayodhya Aerial View Video) తీసి పోస్ట్ చేసింది. ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య ఎంత అందంగా ముస్తాబైందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం 16 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఉత్సవంలో పాల్గొనే ముందు ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల పాటు అనుష్ఠానం పాటించారు. కఠిన దీక్ష చేశారు. ఇటు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకూ రాముడి జీవితంతో ముడి పడి ఉన్న అన్ని ఆలయాలనూ సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. 


"చారిత్రక ఘట్టమైన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రముఖులంతా తరలి వస్తున్నారు. దేశంలోని అన్ని వర్గాలు, మతాలకు చెందిన వాళ్లూ పెద్ద ఎత్తున అయోధ్యకు చేరుకుంటున్నారు. గిరిజన తెగలకు చెందిన వాళ్లూ ఆధ్యాత్మిక నగరికి వస్తున్నారు"


-  ప్రధాని మోదీ కార్యాలయం






అయోధ్యలో అన్ని వీధులూ కాషాయంతో నిండిపోయాయి. జైశ్రీరామ్ పేరిట పెద్ద ఎత్తున జెండాలు వెలిశాయి. కొన్ని చోట్ల రాముడి హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు కట్టారు. లతా మంగేష్కర్ చౌక్ వద్ద ఈ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాల రాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది.