ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాకేష్ ఆస్థానా మరో రెండు నెలల్లో రిటైర్ కావాల్సి ఉంది. ప్రస్తుతం బీఎస్ఎఫ్ డీజీగా ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితులైన అధికారి. ఆయనను ఇటీవల సీబీఐ చీఫ్‌గా నియమించేందుకు కేంద్రం ప్రయత్నించింది. టాప్ త్రీలో ఆయన పేరు ఉంది. కానీ నియామకం ప్యానల్‌లో సభ్యుడు అయిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ... రెండేళ్ల సర్వీస్ ఉండి ఉండాలనే నిబంధన ఎత్తి చూపడంతో ఆయనకు అవకాశం రాకుండా పోయింది. దీంతో ఆయనను నిరాశపర్చకుండా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా కేంద్రం నియమించింది.


రాకేష్ ఆస్థానాపై ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. కొన్నాళ్ల క్రితం వరకూ సీబీఐలో స్పెషల్ డిప్యూటీ డైరక్టర్ గా ఉన్న రాకేష్ ఆస్థానా పని చేసేవారు.  ఆయన పైన మరో ఐపీఎస్ ఆఫీసర్ అలోక్ వర్మ ఉండేవారు. రాకేష్ ఆస్థానా  హై ప్రోఫైల్ కేసులు దర్యాప్తు చేశారు. విజయ్ మాల్యా కేసు మొదలుకుని..అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసు వరకూ.. చాలా కీలకమైన కేసులకు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. కానీ ఆయన సీబీఐకి రావడమే వివాదాస్పదమయింది. ఆస్థానా.. గుజరాత్ లో పనిచేసినప్పుడే.. ఆరోపణలు వచ్చాయి కాబట్టి.. ఆయనను సీబీఐలో నియమించకూడదని వ్యతిరేకించినా కూడా.. ప్రధానమంత్రి కార్యాలయం.. ప్రత్యేకంగా  ఇనిషియేటివ్ తీసుకుని ఆయనను నియమించింది.  రాకేష్ ఆస్థానాకు..మోడీకి.. ప్రధానమంత్రి కార్యాలయానికి ఉన్న అనుబంధంతోనే.. ఆయన సీబీఐ స్పెషల్ డైరక్టర్ గా వచ్చారని..అధికారవర్గాలకు బాగా తెలుసు. 
 
సీబీఐలో ఉన్నప్పుడు... సీబీఐ చీఫ్‌గా ఉన్న అలోక్ వర్మ  చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కు ... అలోక్ వర్మపై.. రాకేష్ ఆస్థానా ఫిర్యాదు చేశారు. నిజానికి అప్పటికే.. రాకేష్ ఆస్థానాపై.. సీబీఐ విచారణ కూడా ప్రారంభించింది.  ఆయన హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి వద్ద లంచం తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ రచ్చ కారణంగా ప్రధాని నేతృత్వంలోని హైపవర్ కమిటీ అప్పటి సీబీఐ చీఫ్ అలోక్ వర్మను పదవి నుంచి తప్పించింది. దాంతో ఆయన రాజీనామా చేసేశారు. తనకు కేటాయించిన ఉద్యోగంలో చేరకుండా... అసలు ఉద్యోగానికే రాజీనామా చేశారు.   


అయినప్పటికీ రాకేష్ ఆస్థానాను మళ్లీ సీబీఐలోకి తీసుకు రావాలని ప్రయత్నించారు. కుదరకపోయే సరికి.. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. అక్కడ పోలీసు వ్యవస్థ కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆస్థానా చేతుల్లో పోలీసు వ్యవస్థను పెట్టడంతో.. కేజ్రీవాల్ సర్కార్‌పై బీజేపీ మరింత విరుచుకుపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని అర్థం మార్చేసింది కేంద్రం. ముందు ముందు ఢిల్లీలో రాజకీయం మరింత ఘాటెక్కనుంది.