సుప్రీంకోర్టులో తెలుగులో వాదనలు జరుగుతాయని ఎవరైనా ఊహించగలరా..?. ఊహించడం కాదు.. సాధ్యం కాదు. కానీ అనూహ్యంగా ఇలాంటి వాదనలు సుప్రీంకోర్టులో జరిగాయి. సీజేఐ ఎన్‌వీ రమణ ఉన్న బెంచ్‌ మీదకు..  ఓ వివాహానికి సంబంధించిన కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో కక్షిదారు అయిన మహిళ వాదనలు వినిపించాల్సి వచ్చింది. అయితే ఆమెకు భాషా సమస్య వచ్చింది. ఇంగ్లిష్‌లో వాదనలు వినిపించడానికి ఇబ్బంది పడింది. సరిగ్గా భావ వ్యక్తీకరణ చేయలేకపోయారు. తన వాదన వినిపించడానికి తడబడ్డారు. ఆమె ఇబ్బందిని గమనించిన జస్టిస్ ఎన్‌వీ రమణ తెలుగులోనే .. చెప్పాలని కోరారు. దాంతో ఆమె రిలీఫ్ ఫీలయింది.  న్యాయం కోసం.. తాను చెప్పాలనుకున్నదంతా తెలుగులోనే వివరంగా ధర్మాసనం ముందు చెప్పింది. 


ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలో సీజేఐ ఎన్వీ రమణతో పాటు మరో న్యాయమూర్తి జస్టిస్ సూర్యాకాంత్ కూడా ఉన్నారు. ఆయన తెలుగువారు కాదు. దీంతో జస్టిస్ ఎన్వీ  రమణ.. ఆమె తెలుగులో వినిపిస్తున్న  వాదనలను..  ఇంగ్లిష్‌లో జస్టిస్‌ సూర్యకాంత్‌కు స్వయంగా  వివరించారు. దీంతో ఆమె ఎక్కడా భాషా సమస్యతో ఇబ్బంది లేకుండా.. తాను చెప్పాలనుకున్నదంతా చెప్పారు. జస్టిస్ ఎన్వీ రమణ భాషా ప్రేమికుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎలాంటి సందర్భంలో అయినా ప్రఖ్యాత తెలుగు కవుల రచనలను ఊటంకిస్తూ ఉంటారు. చీఫ్ జస్టిస్ అయిన సమయంలో న్యాయవ్యవస్థ గురించి రావిశాస్త్రి రాసిన పద్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. సాహిత్యానికి సంబంధించి ఎవరైనా ఎలాంటి సహాయసహకారాలు అడిగినా ఆయన ఆలోచించకుండా చేస్తారన్న ప్రచారం ఉంది. మాతృభాష.. జాతి ఔన్నత్యానికి ప్రతీక అని జస్టిస్ ఎన్వీ రమణ భావన. మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ ఉంటారు. అవధాన సాహిత్య ప్రక్రియల్లోనూ పాల్గొంటూ ఉంటారు.
 
అదే సమయంలో ప్రాంతీయ భాషల్లో న్యాయపాలన సాగాలన్న అభిలాష కూడా ఆయనకు ఉంది. దీనికి సంబంధించి గతంలోనే సంస్కరణలు ప్రారంభమయ్యాయి. దిగువ కోర్టుల్లో తెలుగులోనూ వాదనలు వినిపించే అవకాశం గతంలో కల్పించారు. అయితే.. న్యాయపాలన అంతా ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. ఇక సుప్రీంకోర్టు స్థాయిలో అయితే.. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం లభించదు. కానీ అప్పుడప్పుడు మాత్రం.. న్యాయమూర్తులు..  కక్షిదారులు ఇబ్బంది పడుతూంటే స్పందిస్తూంటారు. జస్టిస్ ఎన్‌వీ రమణ కూడా అలాగే స్పందించారు.  మాతృభాషపై ఆయన ప్రేమను మరోసారి ఘనంగా చాటుకున్నారు. ఈ అరుదైన కేసు విచారణ.. అందర్నీ ఆకట్టుకుంది. సీజేఐ ఎన్వీ రమణకు ఉన్న మాతృభాషా ప్రేమ మరోసారి హాట్ టాపిక్ అయింది.