ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన టెక్ దిగ్గజం (Tech Gaints) యాపిల్‌ (Apple) ఆదాయం రెండో త్రైమాసికంలో భారీగా పెరిగింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈసారి ఆదాయం 35 శాతం ఎగబాకింది. ఐఫోన్ అమ్మకాలు పుంజుకోవడం.. విపణిలో యాపిల్‌ ఉత్పత్తుల విక్రయాల ఆధిపత్యం కొనసాగడమే ఇందుకు కారణమైనట్లు స్పష్టమవుతోంది.


త్రైమాసిక ఫలితాల్లోని ముఖ్యాంశాలు..


క్యూపర్టినో కేంద్రంగా పనిచేస్తున్న యాపిల్‌ (Apple) ఆదాయం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 81 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. విశ్లేషకులు అంచనా వేసిన 73 బిలియన్‌ డాలర్లను మించి రావడం విశేషం. అలాగే క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 60 బిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చింది. దాంతో పోలిస్తే ఈసారి 35 శాతం పెరిగింది.


నికర లాభం 21.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఒక్కో షేరుపై 1.30 డాలర్ల నికర లాభం వచ్చింది. క్రితం ఏడాది ఇదే సీజన్‌లో 11.3 బిలియన్‌ డాలర్లు, 0.63 డాలర్లుగా ఉన్నాయి.


ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ (Apple) ఉత్పత్తులకు ఆదరణ, విక్రయాల్లో రెండంకెల వృద్ధి వంటి అంశాలు రికార్డు స్థాయి ఆదాయానికి కారణమని సంస్థ సీఎఫ్‌వో లూకా మేస్ట్రీ తెలిపారు. ముఖ్యంగా చైనాలో విక్రమాలు భారీగా పుంజుకున్నట్లు సంస్థ వెల్లడించింది.


యాపిల్‌ (Apple) షేర్లు గత ఐదేళ్లలో 500 శాతం, గత ఏడాది వ్యవధిలో 55 శాతం మేర ఎగబాకాయి. ఐఫోన్ల అమ్మకాలు భారీగా పెరగడం సంస్థ ఆదాయ వృద్ధికి దోహదం చేస్తోంది. యాపిల్‌ (Apple) ఆదాయంలో 53 శాతం ఐఫోన్ల విక్రయాల నుంచి వస్తున్నదే. గత ఏడాది 275 బిలియన్‌ డాలర్లు విలువ చేసే విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం యాపిల్‌ (Apple) మార్కెట్‌ విలువ దాదాపు 2.5 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది.


ఏప్రిల్​-జూన్​ త్రైమాసిక ఆదాయంలో (81.4 బిలియన్​ డాలర్ల) అమెరికా వాటానే 35.8 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. ఐరోపా మార్కెట్ నుంచి 18.9 బిలియన్ డాలర్లు గడించింది యాపిల్​. చైనా మార్కెట్లో 14.7 బిలియన్ డాలర్లు, జపాన్​లో 6.4 బిలియన్​ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఆసియా ప్రాంతంలోని మిగతా మార్కెట్ల నుంచి 5.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది​.


రాణించిన టెక్ కంపెనీలు..


మహమ్మారి సంక్షోభ సమయంలో చాలా వరకు టెక్‌ కంపెనీలు ఆర్థికంగా రాణించాయి. యాపిల్‌ (Apple) లాభాలు దాదాపు రెండింతలు కాగా.. మైక్రోసాఫ్ట్‌ లాభాల్లో 47 శాతం వృద్ధి కనబడింది. అలాగే గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ సైతం తమ విక్రయాలు, లాభాలు భారీగా పుంజుకున్నాయని వెల్లడించింది. లాక్‌డౌన్‌ సమయంలో అన్‌లైన్‌ అడ్వర్‌టైజింగ్‌ భారీగా పెరగడం గూగుల్‌ లాభాలకు దన్నుగా నిలిచింది. యూట్యూబ్‌ వాణిజ్య ప్రకటనల ఆదాయం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దాదాపు రెండింతలు పెరిగి 7 బిలియన్‌ డాలర్లకు చేరింది


ALSO READ:


Vijay Mallya: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కథ క్లైమాక్స్ కి వచ్చేసింది!


Win 15 Lakhs: పేరు పెట్టు.. మనీ కొట్టు.. కేంద్రం వినూత్న స్కీం..